Breaking News

హైవేపై తనిఖీలు.. ఓ వాహనంలో వందల కిలోల బంగారం చూసి పోలీసులు షాక్!


తమిళనాడు శాసనసభ ఎన్నికలు వేళ భారీ ఎత్తున బంగారం రవాణా వ్యవహారం కలకలం రేపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి సేలం-చెన్నై జాతీయ రహదారిపై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 234 కిలోల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సేలం-చెన్నై జాతీయ రహదారిపై పెరియారీ ప్రాంతంలో ఎన్నికల నిఘా దళం తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో చెన్నై నుంచి సేలం వైపు వస్తున్న ఓ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా.. అందులో ఉన్న బంగారం చూసి అధికారులు షాక్ తిన్నారు. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు తరలించడం, సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్‌ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆభరణాలను చెన్నైలోని ఓ ప్రముఖ నగల దుకాణం నుంచి సేలం తరలిస్తున్నారని, అక్కడ స్థానిక వ్యాపారులకు వీటిని సరఫరా చేయాలని పట్టుబడిన వ్యక్తులు విచారణలో తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నా అనుమతి రాలేదని, గతంలో తీసుకున్న ఆర్డర్‌ మేరకు నగలను డెలివరీ చేయడానికి తీసుకొచ్చామని వారు వివరించారు. అయితే ఆభరణాలకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఘటనపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లకు పంచేందుకే ఈ బంగారాన్ని తీసుకొస్తున్నారా? అన్న కోణంలో విచారించనున్నట్లు తెలిపారు. తిరువారూర్‌ జిల్లాలో రెండు వ్యాన్‌లలో రూ.11 కోట్ల నగదును తరలిస్తుండగా అధికారులు విచారించారు. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలకు నగదు తీసుకెళ్తున్నట్లు తేలడంతో ఎన్నికల అధికారి అళగర్‌స్వామి తిరిగి ఆ నగదును అప్పగించారు.


By March 14, 2021 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/checkings-in-chennai-salem-national-highway-234-kg-gold-jewelery-seized-in-tamil-nadu/articleshow/81491744.cms

No comments