Breaking News

భారతీయ టెకీలకు గుడ్ న్యూస్.. ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయం అమలు వాయిదా!


స్వదేశీ ఉద్యోగులకు మేలుచేసేలా గతంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత అధ్యక్షుడు పక్కనబెడుతున్నారు. తాజాగా, హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయాన్ని వాయిదావేశారు. అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు కనీస వార్షిక వేతనాన్ని 65 వేల డాలర్ల నుంచి 1.10 లక్షల డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ గత అక్టోబరులో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఉత్తర్వుల అమలను బైడెన్ 60 రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కనీస వేతన ఉత్తర్వులకు సంబంధించి అమెరికా కార్మిక శాఖ ఫిబ్రవరి 1న ప్రతిపాదన చేసింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు 15 రోజుల సమయమిచ్చింది. మొత్తం 57 అభిప్రాయాలు రాగా, వాటిని పరిశీలించిన కార్మిక శాఖ.. ట్రంప్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం అమలను మే 14కు వాయిదా వేసింది. హెచ్‌-1బీ వీసాపై పనిచేసేవారి వార్షిక వేతన పరిమితిని 1.10 లక్షల డాలర్లకు పెంపు నిర్ణయం అమలు తేదీని మార్చి 15గా అప్పట్లో ప్రకటించారు. అయితే, దీని అమలను బైడెన్‌ సర్కారు తాజాగా వాయిదా వేసింది. కనీస వేతనం పెంపు ఉత్తర్వులను నిలిపివేయడం వల్ల అమెరికాలో పనిచేసే చాలామంది విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయులకు గొప్ప ఊరటనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అమల్లోకి వస్తే.. 1,10,000 డాలర్ల కన్నా తక్కువ వార్షిక వేతనం ఉన్నవారు స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే. అంతేకాదు, కొత్తగా వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి, సంస్థలు ఆచితూచి తమ ఉద్యోగులను అమెరికాకు పంపుతాయి. అయితే, హెచ్‌-1బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను బైడెన్‌ పక్కనబెట్టడాన్ని ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ రిఫార్మ్‌ (ఫెయిర్‌) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా వీసాల జారీ ప్రక్రియలో లాటరీ పద్ధతిని తిరిగి అవలంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ అధ్యక్షుడు నిర్ణయాల వల్ల.. అత్యుత్తమ ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలో ఉంటారని వాదిస్తోంది. అంతేకాదు, హెచ్‌1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని.. దానివల్ల అమెరికాలోని ఉద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా, శాస్త్ర సాంకేతిక, విద్యారంగం.. ప్రభుత్వం.. ఇలా ఏ విషయంలోనైనా భారతీయ అమెరికన్లు గొప్ప పాత్ర పోషిస్తారని బైడెన్‌ విశ్వసిస్తున్నట్టు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ వ్యాఖ్యానించారు. అందుకే ప్రవాస భారతీయులను గుర్తించి, గౌరవిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల నాసా శాస్త్రవేత్తలతో బైడెన్ మాట్లాడుతూ భారతీయుల ప్రతిభను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు జెన్ సాకీ పై విధంగా స్పందించారు.


By March 13, 2021 at 07:09AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/joe-biden-administration-issues-notification-to-further-delay-mandatory-minimum-pay-for-h-1b-visa/articleshow/81477650.cms

No comments