Breaking News

కోవిడ్ కేసుల పెరుగుదలపై ఉద్ధవ్ ఆందోళన.. మహారాష్ట్రలో లాక్‌డౌన్!


దేశంలో కోవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ మొదలయ్యింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 40వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 111 రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అటు, మహారాష్ట్రపై కరోనా పంజా విసురుతోంది. రికార్డుస్థాయిలో అక్కడ కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం అక్కడ 25వేల పైచిలుక కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలోనూ తొలిసారిగా రోజువారీ కేసులు 3,000 మార్క్ దాటాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలను మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గడచిన 15 రోజులుగా కరోనా వైరస్ వృద్ధిరేటు 300 శాతంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుదలపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా భయంకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం ఉన్న ఏకైక ఆప్షన్ లాక్‌డౌన్.. కానీ, కోవిడ్-19 నిబంధనలు పాటించి చివరి నిమిషంలో రాష్ట్ర ప్రజలు సహకరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు. ముంబయిలో శుక్రవారం 3,063కిపైగా కొత్త కేసులు నిర్ధారణ అయినట్టు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. రోజువారీ టెస్టింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి, 50వేలకు పెంచామని అన్నారు. రద్దీ ప్రాంతాల్లో ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులు పడకలను సిద్ధం చేయాలని ఆయన నిర్దేశించారు. ముంబయిలో ఇప్పటి వరకు గతేడాది అక్టోబరు 10 అత్యధికంగా 2,848 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటి కేసులు ఆ రికార్డులను తిరగరాశాయి. కళ్యాణి-దొంబివల్లీలో వారాంతపు రద్దీని నివారించడానికి సంతలను నిషేధించారు. అక్కడ వరుసగా మూడో రోజు 500 కేసులు నమోదయ్యాయి. నవీ ముంబయిలో ఆరు నెలల తర్వాత అత్యధికంగా 347 కేసులు, పన్వేల్‌లో 238 కేసులు బయటపడ్డాయి. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో శుక్రవారం 5,735 కేసులు, 19 మరణాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో వరుసగా రెండో రోజూ 25వేలకుపైగా కేసులు నమోదుకావడంతో మహమ్మారి రెండో దశ విజృంభణకు సంకేతమని ఆ రాష్ట్ర అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ ప్రదీప్ అవాతే అన్నారు. రోజువారీ నిర్ధారణ పరీక్షలను 20 శాతం పెంచగా.. గురువారం 1.20 లక్షల మందికి పరీక్షలను నిర్వహించారు. దేశంలోని మొత్తం కేసుల్లో 65 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. శుక్రవారం మహారాష్ట్ర వ్యాప్తంగా 25,681 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 70 మంది ప్రాణాలు కోల్పోయారు.


By March 20, 2021 at 02:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lockdown-is-an-option-says-maharashtra-cm-uddhav-thackeray-as-cases-rise/articleshow/81602693.cms

No comments