Breaking News

రాజస్థాన్: ఆర్మీ వాహనం బోల్తా.. ముగ్గురు జవాన్లు సజీవదహనం


రాజస్థాన్‌లో గురువారం ఉదయం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సైనిక వాహనం బోల్తాపడిన ఘటనలో ముగ్గురు జవాన్లు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు జవాన్లు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. శ్రీగంగానగర్ జిల్లాలోని గోపాల్‌సర్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. భటిండా ఆర్మీ యూనిట్‌కు చెందిన సైనికులు సూరత్‌గఢ్ నుంచి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న వాహనం రజియాసర్-చత్తర్‌గఢ్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. జిప్సీ వాహనం బోల్తాపడిన తర్వాత మంటలు అంటుకోవడంతో ముగ్గురు జవాన్లు బయటకు రాలేకపోయారు. లోపల చిక్కుకుపోవడంతో వారంతా మంటలకు ఆహుతయ్యారు. మిగతా సైనికులు మాత్రం చాకచక్యంగా తప్పించుకోవడం గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాయపడిన సైనికులను చికిత్స కోసం సూరత్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. రజియాసర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి విక్రమ్ తివారీ మాట్లాడుతూ.. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరా గాంధీ కెనాల్ 330 స్తంభం వద్ద వాహనం బోల్తాపడిందని అన్నారు. ప్రమాద సమయానికి మొత్తం 8 మంది సైనికులు అందులో ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వాహనం బోల్తాపడిన తర్వాత లోపలి నుంచి బయటకు రాలేకపోవడంతో ముగ్గురు జవాన్లు సజీవదహనమైనట్టు ఆయన వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని వివరించారు. ప్రమాదంలో చనిపోయిన సైనికులను సుబేదార్ మమాగర్, హవిల్దార్లు దేవ్ కుమార్, ఎస్కే శుక్లాగా గుర్తించారు.


By March 25, 2021 at 11:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-solider-burnt-alive-as-army-vehicle-overturned-in-rajasthan/articleshow/81684127.cms

No comments