Breaking News

కుమార్తెలు అనుమానాస్పదంగా మృతి.. న్యాయం కోరుతూ తల్లి శిరోముండనం


తన కుమార్తెల ఆత్మహత్య ఘటనపై పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఓ తల్లి శిరోముండనం చేసుకుంది. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్‌లోని శనివారం చోటుచేసుకుంది. అత్తాప్పాలమ్‌‌లో మైనర్ దళిత బాలికలు 2017లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, ఇవి ఆత్మహత్యలు కాదని, అత్యాచారం చేసి హత్యచేశారని బాలికల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించకపోవడంతో పోస్కో కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, పోలీసులే కేసును తప్పదోవ పట్టించారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా బాలికల తల్లి శిరోముండనం చేయించుకుని, నిరసన తెలిపింది. అంతేకాదు, తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ కేరళవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనట్టు ఆమె తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోకుంటే తాను శిరోముండనం చేయించుకుంటానని గతంలోనే ఆ మహిళ ప్రకటించారు. దళిత మానవహక్కుల రాష్ట్ర అధ్యక్షురాలు సలీనా ప్రాక్కనమ్, సామాజిక కార్యకర్త బిందూ కమలన్‌లు ఆమెకు మద్దతుగా శిరోముండనం చేయించుకున్నారు. ఈ ఆందోళనకు ఎంపీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాశ్ సంఘీభావం తెలిపారు. ఇక, మార్చి 4తో ఈ ఘటనకు నాలుగేళ్లు పూర్తవుతున్నందున, ఆమెకు మద్దతుగా ఆ రోజున తాము కూడా సామూహిక శిరోముండనం చేయించుకుంటామని వలాయార్ యాక్షన్ కౌన్సిల్ నేతలు ప్రకటించారు. వలాయార్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు 2017లో రోజుల వ్యవధిలో తమ ఇంట్లోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా, ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతుండగా, ప్రతిపక్ష పార్టీలూ ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. హైకోర్టు కూడా దీనిపై స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి, పునర్విచారణకు ఆదేశించింది. అయితే, బాధిత కుటుంబం మాత్రం గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఆందోళన నిర్వహిస్తోంది.


By March 01, 2021 at 12:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-mother-of-girls-tonsures-head-over-lack-of-action-against-police-officials/articleshow/81269253.cms

No comments