Breaking News

బీజేపీ నేత పాదాల వద్ద రాజపుత్ర వీరుడు మహారాణా ఫోటో.. రేగుతున్న దుమారం


స్వాతంత్రం, ఆత్మ గౌరవం కోసం నిరంతంరం మొఘలులతో పోరాటం చేస్తూ ఏనాడు తలవంచని రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్‌ ఫోటోను నేతల పాదాల దగ్గర ఉంచడం వివాదాస్పదంగా మారింది. రాజస్థాన్‌లోని వల్లభ్‌నగర్‌లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా కూర్చుని ఉండగా ఆయన ఎదురుగా ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ కింద సింగ్ ఫోటోను ఉంచారు. ఈ విషయం గమనించిన కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర సామాజిక సంస్థల నేతలు తీవ్రంగా స్పందించారు. మహారాణా ప్రతాప్ సింగ్‌కు అవమానం జరిగిందంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. త్వరలో వల్లభ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో బీజేపీ ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో ఇది మరింత రభసకాకుండా ఉండేందుకు బీజేపీ అప్రమత్తమయ్యింది. దీనిపై క్షమాణలు చెబుతూ బీజేపీ అధ్యక్షుడు సతీష్ వెంటనే ఒక ప్రకటన జారీ చేశారు. ఇటీవల తమ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు పొరపాటున మహారాణా ప్రతాప్ సింగ్ ఫోటోను టేబుల్ కింద ఉంచారని అన్నారు. దానిని తాము గమనించలేదని, ఈ పొరపాటుకు చింతిస్తున్నామని, మహారాణా ప్రతాప్ సింగ్ అందరినీ ఆదర్శప్రాయుడని ఆయన పేర్కొన్నారు. వల్లభనగర్‌ అసెంబ్లీ స్థానంలో రాజపుత్ర ఓటర్లు కీలకం కావడంతో ఈ ఘటనపై నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇక, మహారాణా ప్రతాప్ మేవాడ్‌ను 1568 నుంచి 1597 వరకు పరిపాలించారు. గొప్ప చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొన్న అక్బర్ ఆ సమయంలో ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వాతంత్రం, ఆత్మ గౌరవం కోసం నిరంతంరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్ ఏనాడు తలవంచలేదు. మహారాణా ప్రతాప్ ఒకసారి తలదించి తన కాళ్లమీద పడితే సగం హిందూస్థాన్‌కు రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే, దాన్ని తుచ్ఛమైందిగా తిరస్కరించిన మహావీరుడు.


By March 10, 2021 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharana-prataps-symbol-placed-near-the-bjp-president-feet-on-the-stage-in-rajasthan/articleshow/81422684.cms

No comments