Breaking News

Vizag Steel Plant Row: విశాఖ ఉక్కు ఉద్యమం.. టాలీవుడ్ నుంచి ఒకరిద్దరి గళం.. పత్తాలేని పెద్ద స్టార్లు


ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు హోరెత్తున్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన నేపథ్యంలో విశాఖలో ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ధర్నాలు, రిలే దీక్షలు, మానవహారం, నిరసనలు, ఆందోళన బాట పట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణ చేస్తామని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈక్విటీ షేర్ లేదని నిర్మల సీతారామన్ తేల్చిచెప్పడంతో.. విశాఖలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ఏపీ ప్రజలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. అయితే టాలీవుడ్ పెద్దలు.. బడా నిర్మాతలు, స్టార్ హీరోలు హీరోయిన్లు మాత్రం.. ఎప్పటిలాగే మనకెందుకులే అన్నట్టుగానే సినిమా చూస్తుండిపోయారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ట్విట్టర్ వేదికగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తమ్ముడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ ఇప్పటికే నిరసన గళం వినిపించారు. ఆంధ్రుడా మేలుకో. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది. సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దాం. గొంతు పెకలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం.’’ అని నారా రోహిత్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రైటర్ కోనా వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ‘లాస్‌లో ఉన్న నడుస్తుంది కాబట్టే విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నాం అని కేంద్రం అంటుంది.. ప్రైవేట్ వాళ్లు తీసుకుని లాస్‌లో అయితే నడపరు కదా.. లాస్‌లో నడుస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేట్ వాళ్లకి ఇవ్వగానే ప్రాఫిట్‌లోకి వెళ్తుందంటే.. ఆ లాజిస్టిక్స్ ఏమిటో స్టడీ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా కేంద్రం పనిచేస్తూ కనీసం ఒకటి రెండు సంవత్సరాలు అవకాశం ఇస్తే బాగుంటుంది. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వాళ్లకి ఒక సామాన్య పౌరునిగా రాజకీయ పార్టీలకు అతీతంగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా’ అంటూ అంటూ ఆర్పీ పట్నాయక్ ట్వీట్ చేశారు. ఇక సినీ రచయిత కోన వెంకట్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సంస్థలు లాభాల బాటలో నడిపిస్తే.. మరి ఆ పని ప్రభుత్వం ఎందుకు చేయలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమే కాదు.. అది మా హక్కు డియర్ మోడీ జీ విశాఖ ఉక్కును కాపాడండి’ అంటూ ట్విట్టర్ ద్వారా గళం విప్పారు కోన వెంకట్. అయితే విశాఖలో ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే స్టార్ హీరోలు.. బడా ప్రొడ్యుసర్లు నిర్మాతలు.. టాలీవుడ్ పెద్దలు మాత్రం ఈ ఇష్యూపై నోరు విప్పలేదు. మరి వాళ్లు నోళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చూడాలి.


By March 10, 2021 at 08:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-celebrities-tweets-against-visakhapatnam-steel-plant-privatisation/articleshow/81422541.cms

No comments