Breaking News

క్యాపిటల్ హిల్ దాడి: పైప్ బాంబు నిందితుడి వీడియో విడుదలచేసిన ఎఫ్‌బీఐ


క్యాపిటల్ భవనంపై దాడికి ముందు రోజు రాత్రి పైప్ బాంబు అమర్చిన నిందితుడి వీడియో మంగళవారం విడుదల చేసింది. ఇంటిలో తయారుచేసిన ఈ పైప్ బాంబును జనవరి 5 రాత్రి నిందితుడు అమర్చినట్టు ఎఫ్‌బీఐ పేర్కొంది. అతడి గురించి వివరాల సేకరించడంపై దృష్టిసారించామని తెలిపింది. ఎఫ్‌బీఐ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో విడుదల చేశారు. నిందితుడు కాపిటల్ హిల్ పరిసరాల్లోని వీధుల్లో నడుస్తూ ఉండటం ఎఫ్‌బీఐ విడుదల చేసిన ఈ వీడియోలో కనిపిస్తోంది. ముదురు రంగులో ఉన్న ప్యాంట్, దానిపై తెలుపు రంగు టీషర్ట్, చేతులకు గ్లోవ్స్ ధరించి, ముఖానికి కళ్లజోడు, మాస్క్ వేసుకుని, ఓ చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఉన్నాడు. క్యాపిటల్ భవనంపై దాడి అనుమానితుడికి సంబంధించిన ఫోటోలను ఇప్పటికే విడుదల చేసిన ఎఫ్‌బీఐ.. అతడి ఆచూకీ చెప్పినవారికి 1,00,000 డాలర్లు రివార్డు ఇస్తామని ప్రకటించింది. క్యాపిటల్ హిల్ సమీపంలోని రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల ప్రధాన కార్యాలయాల వద్ద నిందితుడు పైప్ బాంబు అమర్చినట్టు అనుమానిస్తున్నారు. జనవరి 6న ఎన్నికల్లో విజయాన్ని ధ్రువీవీకరించేందుకు క్యాపిటల్ భవనంలో సభ్యులు సమావేశం నిర్వహించిన సమయంలో ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో పైప్ బాంబులను నిందితుడు అమర్చినా అది పేలలేదు. పోలీసుల దృష్టి మరల్చడానికి ఈ బాంబును అమర్చినట్టు భావిస్తున్నారు. ‘ఇప్పటివరకు పూర్తి సమాచారం గ్రహించలేదు.. అక్కడ ఎవరో ఉన్నారని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం’ అని ఎఫ్‌బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ స్టీవెన్ డీ అంటోనో అన్నారు. అతడిని గుర్తించడానికి తమకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పైపు బాంబులో పేలుడు పదార్థాలు వల్ల తీవ్ర గాయాలు లేదా చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. జనవరి 6న క్యాపిటల్ భవనం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. ఈ దాడి తర్వాత క్యాపిటల్ భవనం వద్ద భద్రతకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ను మోహరించగా.. మే వరకు పొడిగిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.


By March 10, 2021 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/fbi-releases-new-video-of-pipe-bomb-suspect-night-before-capitol-hill-attack/articleshow/81423708.cms

No comments