Breaking News

మోదీని విమర్శిస్తే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే.. బీజేపీ నేత వ్యాఖ్యలు!


పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కోవిడ్ కేసులు పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ టీఎంసీ విమర్శలు గుప్పించగా.. బీజేపీ దీటుగా బదులిచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ప్రజాస్వామ్యం, భారతమాతకు వ్యతిరేకంగా మాట్లాడినట్టేనని నందిగ్రామ్‌ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి సువేందు అధికారి వ్యాఖ్యానించారు. సువేందు అధికారి శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి వ్యతిరేకంగా ఆలోచించడం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడమేనని స్పష్టం చేశారు. ‘కోవిడ్-19కు ప్రధాని మోదీ ఇస్తున్న వ్యాక్సిన్‌ను అందరూ తీసుకోవాలి.. ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రి.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడమే.. భారతమాతకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో టీకాలు లేవు.. కాబట్టి, మోదీ టీకాను అందరు వేసుకోవాలి’ అని సువేందు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట ఎగరా, పతాష్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బెంగాల్ సీఎం .. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సినేషన్‌ సహా అనేక అంశాల్లో మోదీ తీరును ఆమె ఎడగట్టారు. గతేడాది డిసెంబరులో టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి సువేందు అధికారిని మీర్ జఫర్‌తో పోల్చారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి నందిగ్రామ్‌లో ప్రత్యర్థులుగా తలపడుతోన్న విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో మమతను 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని బీజేపీలో చేరిన తర్వాత సువేందు అధికారి శపథం చేశారు. టీకా పంపిణీ జరుగుతున్న వేళ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సువేందు అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నందిగ్రామ్‌ అసెంబ్లీకి రెండో విడతలో ఏప్రిల్ 1న పోలింగ్ జరగనుంది.


By March 20, 2021 at 08:28AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/west-bengal/news/speaking-against-modi-means-speaking-against-democracy-suvendu-adhikari/articleshow/81598649.cms

No comments