Breaking News

మోదీని పొగడ్తల్లో ముంచెత్తిన కాంగ్రెస్ నేత.. తనపై ప్రశంసలకు రిటర్న్ గిఫ్ట్!


పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యుడు, నేత గులాం నబీ ఆజాద్‌‌‌‌కు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయనను ప్రశంసల్లో ముంచెత్తి భావోద్వేగానికి గురయిన విషయం తెలిసిందే. తాజాగా, మోదీపై గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ మోదీ తన మూలాలను మరిచిపోలేదని, ఇది చాలా గొప్ప విషయమని అభినందించారు. జమ్మూ కశ్మీర్‌లో గుజ్జర్లు ఆదివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆజాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యాన్ని, చాయ్‌వాలా అని తన మూలాల గురించి నరేంద్ర మోదీ చెప్పుకోవడం గొప్ప విషయమన్నారు. నిజాన్ని దాచని వ్యక్తిత్వం మోదీ సొంతమని ఆజాద్ కితాబిచ్చారు. ‘నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినే, ఇందుకు నేను గర్వపడుతున్నాను.. మన ప్రధాని నరేంద్ర మోదీ సైతం గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే అని, చాయ్ అమ్మి కప్పులు కడిగానని చెప్పుకుంటారు..చాయ్‌వాలా అని మోదీ చెప్పుకోవడం గర్వపడే విషయం. రాజకీయంగా మేము ప్రత్యర్థులమే కావచ్చు, కానీ, ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవడాన్ని అభినందిస్తున్నాను’ అని ఆజాద్‌ పేర్కొన్నారు. ప్రధాని అయినప్పటికీ తన మూలాలను మరచిపోని వ్యక్తి నరేంద్ర మోదీ అని, అలాంటి వ్యక్తి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తమ మూలలను దాచిపెట్టే వారు బుడగలో జీవిస్తున్నట్టేనని వ్యాఖ్యానించారు. ‘ఒక మనిషి గర్వపడాలి (అతను ఎవరో, ఎక్కడ నుంచి వచ్చాడో). నేను ప్రపంచమంతా పర్యటించాను.. ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్‌లో బస చేశాను ... కానీ, నేను నా గ్రామానికి చెందిన ప్రజల మధ్య కూర్చున్నప్పుడు వారు ఉతికి బట్టలు వేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా అక్కడ వచ్చే సువాసనతో ప్రత్యేక అనుభూతి పొందుతాను’ అన్నారు. కాగా, ఫిబ్రవరి 9న రాజ్యసభలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఆజాద్‌ సేవలను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మోదీ పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు, కాంగ్రెస్‌ అధినాయకత్వం తీరును ప్రశ్నిస్తూ ‘జి-23’గా పేరుపొందిన సీనియర్‌ నేతలు శనివారం జమ్మూ కశ్మీర్‌లో సమావేశమైన విషయం విదితమే. కాంగ్రెస్‌ బలహీనపడుతోందని, దాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన నేతలు... ఆజాద్‌ అనుభవాలను పార్టీ సక్రమంగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. ఇది జరిగిన మర్నాడే గులాం నబీ ఆజాద్‌ మరోసారి ప్రధానిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.


By March 01, 2021 at 07:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-senior-leader-ghulam-nabi-azad-returns-modi-praise/articleshow/81265384.cms

No comments