Breaking News

97 శాతం ప్రభావశీలత చూపిన ఫైజర్ టీకా.. ఇజ్రాయేల్ విశ్లేషణలో వెల్లడి


ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 97 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడయ్యింది. వ్యాక్సిన్ సమర్థతపై క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటికే నిర్ధారణ అయినప్పటికీ, కోవిడ్ రోగుల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఫైజర్ విశ్లేషణలో తేలింది. ఇజ్రాయెల్‌లో పెద్దఎత్తున్న వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా ఫైజర్‌ టీకాను వినియోగిస్తున్నారు. దేశంలోని 40శాతం మందికి ఇప్పటికి వరకూ వ్యాక్సిన్‌ అందజేశారు. ఇందులో భాగంగా జనవరి 17 నుంచి మార్చి 6వరకు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సమాచారాన్ని విశ్లేషించారు. అసిమ్టమాటిక్ కరోనా కేసుల్లో 94 శాతం సమర్థత కనబరిచినట్లు ఇప్పటికే వెల్లడికాగా.. లక్షణాలు బయటపడిన వారిలోనూ 97శాతం ప్రభావశీలత ఉన్నట్లు తేలింది. అంతకు ముందు డిసెంబర్‌లో జరిపిన విశ్లేషణల్లోనూ ఇదే తరహా ఫలితాలు వెల్లడయినట్టు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా టీకా అందుబాటులోకి వస్తోన్న తరుణంలో తాజా ఫలితాలు ఎంతో కీలకమని పేర్కొన్నాయి. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులలో కోవిడ్ లక్షణాలు 44 రెట్టు అధికంగా అభివృద్ధి చెందగా.. మరణాల అవకాశం 29 రెట్లు ఎక్కువని విశ్లేషణలో వెల్లడయ్యింది. ఇజ్రాయేల్‌లో అత్యంత వేగంగా వ్యాప్తించెందే B.1.1.7 రకం వేరియంట్ వ్యాప్తిలో ఉందని ఆరోగ్య శాఖ పర్యవేక్షణ డేటా పేర్కొంది. ఇజ్రాయెల్ బలమైన ఆరోగ్య వ్యవస్థ, అపూర్వమైన సామాజిక సమీకరణ, అవగాహన తక్కువ వ్యవధిలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ శర వేగంగా కొనసాగడానికి దోహదం చేస్తోంది. ఇందుకు సమగ్ర ప్రజారోగ్య నిఘా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్త టీకా ప్రచారం అద్భుతమైన విజయాన్ని నమోదు చేయగలిగింది. ప్రపంచంలో వందకుపైగా దేశాల్లో ఇప్పటికే టీకా అందుబాటులోకి వచ్చింది. అయితే, వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు చూపిస్తున్నాయన్న కారణంతో కొన్ని దేశాలు టీకా పంపిణీని నిలిపివేశాయి. ఇప్పటివరకు ఆరు దేశాల్లో టీకా పంపిణీ నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకడుతున్నట్లు డెన్మార్క్‌లో తాజాగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అక్కడ పంపిణీ చేస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డెన్మార్క్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రక్తం గడ్డకట్టడానికి వ్యాక్సిన్‌ కారణమా అనే అంశంపై స్పష్టత రాలేదని పేర్కొంది. ప్రస్తుతం వీటిని సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని, అందుకే తాత్కాలికంగా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఆస్ట్రియాతో పాటు ఎస్తోనియా, లాట్వియా, లిథ్వేనియా, లుక్సెంబర్గ్‌ దేశాలు తాత్కాలికంగా వ్యాక్సిన్‌ పంపిణీని నిలిపివేశాయి.


By March 12, 2021 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pfizer-says-coronavirus-vaccine-97-effective-against-symptomatic-infections/articleshow/81460265.cms

No comments