Breaking News

హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 8 మంది మృతి


హిమాచల్‌ ప్రదేశ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలోకి దూసుకెళ్లిన 8 మంది దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చంబా జిల్లాలోని తీసా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి బస్సులో 16 మంది ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. తీసా వద్ద బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఘటనా స్థలిలోనే ఆరుగురు మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది మంది గాయపడగా.. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చంబా ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందజేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మారుమూల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా అందింది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, డిప్యూటీ స్పీకర్, చురాహ్ ఎమ్మెల్యే హన్స్‌రాజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం ఆర్ధిక సాయం ప్రకటించారు. ఒక్కోక్కరికి రూ.4 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. చంబా జిల్లాలో తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది నవంబరులో చంబా-ఖజ్జియార్ రహదారిపై వెళ్తోన్న ఓ కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళ్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి వాహనం లోయలో పడిపోయింది. మార్చిలోనూ జరిగి ముగ్గురు చనిపోగా.. 35 మంది గాయపడ్డారు.


By March 10, 2021 at 01:32PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/eight-killed-as-bus-falls-into-gorge-in-himachal-pradeshs-chamba/articleshow/81427385.cms

No comments