Breaking News

దేశంలో 68వేలకుపైగా కొత్త కేసులు.. మహారాష్ట్రలో బద్ధలవుతోన్న పాత రికార్డులు!


దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విశ్వరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 68,206 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. మరో 295 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,20,39,210కు చేరగా.. వీరిలో 1,61,881 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి 1,12,53,727 మంది కోలుకోగా.. 5,18,767 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవార ఉదయం వరకు దేశవ్యాప్తంగా మరో 32,149 మంది కోలుకున్నారు. ఇక, మహారాష్ట్రలో కోవిడ్ మహోగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆదివారం ఏకంగా అక్కడ 40,414 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మరో 108 మంది బలయ్యారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 27 లక్షలు దాటింది. ఇక, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో అత్యధికంగా 3,082 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. పంజాబ్, కేరళ, తమిళనాడు సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో 2 వేలకుపైగా కేసులు నమోదుకాగా.. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, యూపీతోపాటు ఐదు రాష్ట్రాల్లో మూడు నెలల తర్వాత పాజిటివ్ కేసులు 1,000 మార్క్ దాటాయి. మరోవైపు, దేశంలో ముందు వారంతో పోల్చితే గతవారం పాజిటివ్ కేసుల రెట్టింపు 51 శాతంగా ఉంది. ముందు వారం కంటే 1.3 లక్షలకుపైగా ఎక్కువ కేసులు నిర్ధారణ అయ్యాయి. కోవిడ్ మరణాల్లోనూ 51 శాతం పెరుగుదల నమోదుకావడం ఆందోళన కలిగించే అంశం. గతవారం 1,875 మంది చనిపోగా.. డిసెంబరు 21-27 వారం తర్వాత ఇంత దేశంలో పెద్ద సంఖ్యలో కోవిడ్ మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. దేశంలో 168 రోజుల తర్వాత అత్యధిక కేసులు గడచిన 24 గంటల్లో బయటపడ్డాయి. మార్చి 22 నుంచి 28 మధ్య వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 3.9 లక్షల మందికి కొత్తగా వైరస్ నిర్దారణ కాగా.. అక్టోబరు తర్వాత ఇదే అత్యధికం. ముందు వారం (మార్చి 15-21)తో పోల్చితే గతవారం పాజిటివ్ కేసులు 67 శాతం పెరిగాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసులు 12 మిలియన్లు దాటగా.. ఇందులో 10 లక్షలు కేసులు ఈ 35 రోజుల్లోనే నిర్ధారణ అయ్యాయి.


By March 29, 2021 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-covid-cases-hitting-a-168-day-high-of-68266-maharashtra-alone-40414-on-sunday/articleshow/81742240.cms

No comments