Breaking News

గార్మెంట్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 20 మందికిపైగా సజీవదహనం


వస్త్ర తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 20 మందికిపైగా సజీవదహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఉత్తర ఈజిప్టులోని అల్ క్వాలిబియా నగరంలో గురువారం చోటుచేసుకుంది. రాజధాని నగరం కైరోకు సమీపంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. స్థానిక వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో పనిచేసే సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. ప్రాణ భయంతో కొందరు బయటకు పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పడానికి మొత్తం 15 ఫైర్ ఇంజిన్లను వినియోగించారు. నాలుగంతస్తులు భవనంలోని ఈ పరిశ్రమలో తొలుత మంటలు ఎలా వ్యాపించాయనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే, తాజా ఘటన ఈజిప్టులోని అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది. తరుచూ ఇటువంటి ప్రమాదాలు ఈజిప్టులో సర్వసాధారణమైపోయాయి. గత నెలలో అక్రమంగా నిర్వహిస్తున్న ఉన్న లెదర్ ఉత్పత్తుల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 13 అంతస్తుల భవంతిలో చెలరేగిన మంటలను అదుపుచేయడానికి సిబ్బంది ఒక్క రోజంతా శ్రమించాల్సి వచ్చింది. అగ్ని కీలలకు భవనం ఆహుతికావడంతో మంటలను అదుపు చేసిన తర్వాత దానిని అధికారులు కూల్చివేశారు. గతేడాది డిసెంబరులో ఓ ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో మంటలు చెలరేగి ఏడుగురు కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు.


By March 12, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-20-killed-in-fire-at-garment-factory-near-cairo-in-northern-egypt/articleshow/81459306.cms

No comments