Breaking News

అనూహ్య పరిణామం.. కాల్పుల ఉల్లంఘనపై భారత్, పాక్ మధ్య కీలక చర్చలు


తొమ్మిది నెలలుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభన క్రమంగా వీడుతున్న వేళ.. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వివాదం విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉప్పూ నిప్పులా ఒకరిపై ఒకరు కత్తిదూసే దాయాదులు శాంతి బాట పట్టాయి. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ పరస్పరం సంబంధాలను మెరుగుపరుచుకునేలా చర్చలకు శ్రీకారం చుట్టాయి. సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌-పాక్ మధ్య చర్చల ప్రక్రియ మొదలైంది. భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య హాట్‌లైన్‌లో బుధవారం కీలక చర్చలు జరిగాయి. నియంత్రణ రేఖ వెండి కాల్పుల విరమణ ఒప్పందం పటిష్టంగా పాటించడం సహా ఇతర అంశాల్లో పాత ఒప్పందాలను కఠినంగా అమలు చేయాలని ఈ చర్చల్లో పరస్పరం నిర్ణయించాయి. పూర్తి స్నేహపూర్వక, సహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య గతంలో జరిగిన అన్ని ఒప్పందాలను సమీక్షించారు. అనంతరం భారత్ పాకిస్థాన్‌లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హింసాత్మక చర్యలకు దారితీసి.. శాంతికి విఘాతం కలిగిస్తోన్న ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను, ఆందోళనలను పరస్పర ప్రయోజనార్థం, సుస్థిర శాంతి కోసం పరిష్కరించుకోవాలని డీజీఎంవోలు నిర్ణయించారు... నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ సహా ఇరు దేశాల మధ్య జరిగిన అన్ని అంగీకారాలు, ఒప్పందాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇది ఫిబ్రవరి 24-25 నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా, సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఒప్పందం 2003లో జరిగినా కొన్నేళ్లుగా పలుమార్లు ఉల్లంఘనలు జరిగాయి. 2016లో ఉరి సెక్టార్‌‌పై ఉగ్రవాదుల దాడి తర్వాత కాల్పులు విరమణ ఒప్పందం ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. గత మూడేళ్లలో పాకిస్థాన్‌ 10,752సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. పాక్‌ సైన్యం కాల్పుల కారణంగా 70 మంది భద్రతా సిబ్బంది, మరో 70 మంది పౌరులు మృతిచెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల వి రమణ ఒప్పందాన్ని బుధవారం రాత్రి నుంచే కఠినంగా అమలుచేయాలని డీజీఎంవోలు నిర్ణయించారు.


By February 26, 2021 at 07:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/directors-general-of-military-operations-of-india-and-pakistan-on-ceasefire-violations/articleshow/81220195.cms

No comments