Breaking News

సోషల్ మీడియా, ఓటీటీలపై కేంద్రం కొరడా.. కొత్త నియావళిని అతిక్రమిస్తే ఖేల్ ఖతం


గత కొంతకాలంగా తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలు, నేరపూరిత సమాచారాన్ని ప్రసారం చేస్తున్న సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాంలపై కేంద్రం కొరడా ఝలిపించింది. వీటిని నియంత్రించేలా కఠిన నిబంధనావళిని కేంద్రం గురువారం విడుదల చేసింది. తమ వేదికలపై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్, ఆమెజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ట్రీమింగ్‌ సంస్థలు అనుసరించాల్సిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021 పేరుతో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేవకర్ వివరాలను వెల్లడించారు. కేంద్రం వెలువరించిన మార్గదర్శకాలు ఓ విధంగా భారీ షాక్‌గానే పరిగణించాలి. తాజాగా నిబంధనలతో ఓటీటీ, సోషల్ మీడియాకు దాదాపు కళ్లెం పడినట్టే. ఈ మార్గదర్శకాలను పక్కాగా అమలకు మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు స్పష్టం చేసింది. తాజా, నిబంధనల ప్రకారం.. ఏదైనా పోస్టును తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేస్తారు. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. నోటీసులు జారీచేసిన దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొలగించాలి. ఇక అధికారులు ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంటల్లోగా పూర్తి సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపైనా కీలక షరతులు విధించారు. సదరు సంస్థలు భారత్‌లో ఆయా కార్యాలయాలు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటీటీ నిబంధనలు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఇష్టానుసార వీడియోలు పోస్ట్‌ చేయడం, అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై నిషేధించింది. వయస్సు ఆధారంగా ఐదు విభాగాలుగా ఓటీటీ విభజించి, సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్‌పై నిషేధం విధించారు. మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించేలా, జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉన్న అంశాలపై నిషేధం. అసత్య ప్రచారం ప్రారంభించే తొలి వ్యక్తి వివరాలు కచ్చితంగా వెల్లడించాలి. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం సంస్థలు దేశంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. నిబంధనలు.. సోషల్ మీడియా వేదికల్లో సమాచారం, కంటెంట్‌పై వినియోగదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి. అభ్యంతరకరమైన అంశాలను గుర్తించిన తరువాత వాటిని 24 గంటల్లో తొలగించాలి. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. నోడల్ ఏజెన్సీ 24 గంటలు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది.. ఫిర్యాదులను అమలు చేయడానికి ఈ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది. ఈ నిబంధనలను ప్రచురించిన తేదీ నుంచి 3 నెలల్లోపు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (సీసీఓ)ను నియమించాలి. చట్టానికి, నిబంధనలకు సీసీఓ బాధ్యత వహించాలి. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ డేటా చవకగా లభిస్తున్న భారత్‌.. సోషల్‌ మీడియా సంస్థలకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. సోషల్‌ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్‌ మీడియా నిబంధనలను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ నిబంధనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో స్పందించారు. అన్ని సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. అదే విధంగా అన్ని డిజిటల్‌ సంస్థలూ భారత చట్టాలకు లోబడి ఉండాలని ఆయన సూచించారు.


By February 26, 2021 at 06:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/central-government-issued-guidelines-on-social-media-and-ott-regulation/articleshow/81220034.cms

No comments