Breaking News

బెంగాల్: టీఎంసీ నేతలపై బాంబుదాడి.. ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం


పశ్చిమ్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మంగళవారం రాత్రి బాంబు దాడి జరిగింది. మేదినీపూర్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఓ కార్యకర్త మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. టీఎంసీ కార్యకర్తలపై దుండగులు బాంబులు విసిరి, తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. నారాయణ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అభిరామ్‌పూర్ గ్రామం వద్ద కల్వర్ట్‌పై టీఎంసీ కార్యకర్తలు కూర్చుని ఉండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వారిపై బాంబులు విసిరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టీఎంసీ కార్యకర్త షౌభిక్ దౌలై మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. కల్వర్ట్‌పై కూర్చుని ఉండగా దుండగులు బాంబు విసిరారని, అక్కడ నుంచి బాధితులు పారిపోతుండగా తుపాకితో కాల్పులు జరిపిపట్టు పేర్కొన్నారు. వా ఘటనలో గాయపడిన ముగ్గురినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే దౌలై మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మేదినీపూర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, దీనిని బీజేపీ నేతలు ఖండించారు. టీఎంసీలో అంతర్గపోరుకు ఇది నిదర్శనమని, ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని మేదినీపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సమిత్ దాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ ఘటనతో అభిరామ్‌పూర్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.


By February 24, 2021 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tmc-worker-killed-2-injured-in-bomb-attack-in-medinipur-in-west-bengal/articleshow/81183691.cms

No comments