Breaking News

జోరుమీదున్న వరంగల్ శ్రీను.. ‘సుల్తాన్’ కూడా ఆయన చేతికే!


ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆయన తమ్ముడు శిరీష్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఓవర్‌నైట్ పాపులారిటీ సంపాదించారు నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. నైజాం ఏరియాలో దిల్ రాజు, శిరీష్ నియంతల్లా వ్యవహరిస్తున్నారని.. థియేటర్లన్నీ వారి కనుసన్నల్లో నడుస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే, దిల్ రాజుపై వరంగల్ శ్రీను ఫైర్ అయినప్పటి నుంచీ ఆయన వరుస పెట్టి సినిమాలను కొనుగోలు చేస్తుండటం విశేషం. ‘క్రాక్’ను నైజాంలో విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వరంగల్ శ్రీను.. ఆ తరవాత ‘నాంది’, ‘విశాల్ చక్ర’ సినిమాలను విడుదల చేసి హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. నితిన్ ‘చెక్’ సినిమా నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేశారు. ఈ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. అలాగే ‘విరాటపర్వం’, ‘టక్ జగదీష్’, ‘పుష్ప’ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా నైజాం హక్కులను కూడా ఆయనే కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనిక కోసం ఆయన భారీగానే వెచ్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రాబోయే చిత్రాలన్నింటినీ నైజాంలో వరంగల్ శ్రీనే కొనుగోలు చేస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే, తాజాగా వరంగల్ శ్రీను ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది. తమిళ స్టార్ కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుల్తాన్’. తెలుగులోనూ అదే పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేశారు. ఏపీ, తెలంగాణలో ఆయన విడుదల చేస్తున్నారు. రూ.7.30 కోట్లకు ‘సుల్తాన్’ థియేట్రికల్ రైట్స్‌ను వరంగల్ శ్రీను కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనిపై జీఎస్టీ అదనం. ‘సుల్తాన్’ టీజర్ విడుదలైనప్పటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ఆమె నటించిన తొలి తమిళ చిత్రమిది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


By February 24, 2021 at 09:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/warangal-srinu-aquires-karthi-sulthan-telugu-theatrical-rights/articleshow/81183444.cms

No comments