Breaking News

వారు తప్పా ఉద్యోగులంతా ఆఫీసులకు రావాల్సిందే.. కేంద్రం ఆదేశాలు


రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పని దినాల్లో కార్యాలయానికి హాజరుకావాలని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీచేసింది. అయితే, కంటెయిన్‌మెంట్ జోన్‌ల పరిధిలో నివాసం ఉండే ఉద్యోగులకు మినహాయింపునిచ్చింది. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లు ఎత్తివేసే వరకూ వీరు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది మార్చిలో కోవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత 50 శాతం మంది సిబ్బందిని మాత్రమే కార్యాలయాలకు అనుమతించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ అండ‌ర్ సెక్ర‌ట‌రీ, ఆపై స్థాయి అధికారులు మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. గ‌తేడాది మేలో డిప్యూటీ సెక్ర‌ట‌రీ కంటే త‌క్కువ స్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఆఫీసుల‌కు రావాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. తాజా ఆదేశాల ప్ర‌కారం ఇక నుంచి అన్ని స్థాయిల అధికారులు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరుకావాలి. అయితే, ఆయా విభాగాధిప‌తులు సూచించిన మేర‌కు వివిధ స‌మ‌యాల్లో ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. ‘అన్నిస్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులు పని దినాలలో కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదు’ అని శనివారం వెల్లడించిన ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది. బ‌యోమెట్రిక్ విధానం మాత్రం ప్ర‌స్తుతానికి అమ‌లు చేయ‌డం లేదు. ఇక అన్ని శాఖ‌ల క్యాంటీన్ల‌ను కూడా తెరుచుకోవ‌చ్చ‌ని తాజా ఆదేశాల్లో సిబ్బంది వ్యవహారాల శాఖ స్ప‌ష్టం చేసింది. కంటెయిన్‌మెంట్ జోన్‌లో ఉన్న సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలని, వారు అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండాలని సూచించింది. వీలైనంత వరకు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాలను కొనసాగించాలని, సందర్శకులతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహించడం చేయవచ్చని తెలిపింది.


By February 15, 2021 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/all-central-government-employees-to-attend-office-on-working-days-personnel-ministry-order/articleshow/80919211.cms

No comments