Breaking News

ఉత్తరాఖండ్: మాటలకందని విషాదం.. గల్లంతైన యువకుల దిష్టిబొమ్మలకు తల్లి అంత్యక్రియలు


ఉత్తరాఖండ్ విషాదం ఎందరో తల్లులకు గర్బశోకాన్ని మిగిల్చింది. తమవారు వస్తారని ఎదురుచూసిన వారి ఆశలు అడియాశలవుతున్నాయి. తపోవన్ సొరంగంలో చిక్కుకున్న 34 మంది ప్రాణాలతో ఉంటారనే ఆశ నీరుగారిపోతుంది. మాటలకందని విషాదాన్ని మిగిల్చిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 56 మంది మృతిచెందారు. మరో 160 మంది ఆచూకీ గల్లంతయ్యింది. మంచు చరియలు విరిగిపడి ధౌలిగంగా ఉప్పొంగి తపోవన్ వద్ద ఉన్న జలవిద్యుత్ కేంద్రాన్ని భూస్థాపితం చేసింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. వారు ప్రాణాలతో ఉంటారని ఆశ లేకపోయినా, కడసారి చూపునకు ఆరాటపడింది. అయితే, ఆ ఆశ కూడా నెరవేరదని నిర్ణయానికి వచ్చిన మాతృమూర్తి వారి దిష్టిబొమ్మలకు అంతిమ సంస్కరాలు నిర్వహించింది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు హృదయాలు ద్రవిస్తున్నాయి. హరిపూర్ సమీపంలోని పంజియా గ్రామానికి చెందిన బుడారి దేవి కుమారులు సందీప్, జీవన్ మంచు చరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతయ్యారు. వారి కోసం వారం రోజులు ఎదురుచూసిన కుటుంబసభ్యులు ఆశలు వదులుకున్నారు. చివరిసారిగా వారిని చూడాలని కోరుకున్నా అదీ దక్కదని భావించి ఆదివారం వారి దిష్టిబొమ్మలకు యమునా నదితీరంలో దహన సంస్కారాలు నిర్వహించారు. సందీప్, జీవన్ సోదరుడు మాట్లాడుతూ.. ‘వారి కోసం వారం రోజులు ఎదురుచూశాం.. తపోవన్ డ్యామ్ ముందు భాగంలోనే పనిచేస్తుంటారు.. కాబట్టి ప్రాణాలతో ఉంటారని అనుకోలేదు.. మేము కోరుకున్న ఏకైక విషయం వారి మృతదేహాలను కడసారిగా చూడాలనుకున్నాం.. కానీ అది జరగలేదు.. సమయం అయిపోయింది’ అని కన్నీంటిపర్యంతమయ్యాడు. ఇక, జౌన్‌సరి సామాజిక వర్గం ఆచారం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు భావించి, మృతదేహం లభ్యం కాకపోతే ఘటన జరిగిన 14 రోజుల్లోపు వారి దిష్టిబొమ్మలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. బొమ్మను తయారుచేసి చనిపోయిన వారి దుస్తులను తొడిగి, దహనం చేస్తామని మృతుల మామయ్య, గ్రామ సర్పంచ్ బల్బీర్ చౌహన్ అన్నారు. కొద్ది నెలల కిందట జీవన్ (21) తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఉద్యోగంలో చేరాడని, తర్వాత తన అన్న సందీప్‌ (24)ను కూడా అక్కడ చేర్పించాడని అన్నారు. జనవరి 8నే సందీప్ పనిలో చేరగా.. అతడికి మే 16న వివాహం జరగాల్సి ఉందన్నారు.


By February 16, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-trace-of-missing-sons-relatives-cremate-effigies-in-uttarakhand-tragedy/articleshow/80958143.cms

No comments