Breaking News

కాంగో నదిలో పడవ బోల్తా 60 మంది మృతి.. 300 మందికిపైగా గల్లంతు


కాంగో నదిలో 700 మంది ప్రయాణికులతో వెళ్తోన్న పెద్ద ఓడ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గల్లంతయ్యారు. మై-నోడోంబీ ప్రావిన్సులోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నదిలో మునిగిపోయిన ఓడలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి వెల్లడించారు. ప్రమాదం తర్వాత 60 మృతదేహాలను వెలికితీయగా, మరి కొందరు గల్లంతయ్యారని మంత్రి పేర్కొన్నారు. ఓడలోని 300 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఓడ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్షాసా నుంచి బయలుదేరి భూమధ్యరేఖ ప్రావిన్సు ఈక్వెడార్‌వైపు వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఓడలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే మునిగిపోయిందని మంత్రి చెప్పారు. రాత్రిపూట ప్రయాణం కూడా ప్రమాదానికి ఓ కీలక కారణమని పేర్కొన్నారు. గల్లంతయిన వారికోసం రెస్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని మంత్రి వివరించారు. వీరంతా ప్రాణాలతో ఉంటారనే నమ్మకం లేదన్నారు. కాంగోలో పడవ ప్రమాదాలు సర్వసాధారణం. ఎందుకంటే సామర్ధ్యానికి మించి ప్రయాణికులు, సరుకులను రవాణా చేస్తారు. అంతేకాదు, పడవలో ప్రయాణించే చాలా మంది లైఫ్ జాకెట్లు కూడా ధరించరు. గత నెలలో కివు సరస్సులో పడవ మునిగి ఇద్దరు చిన్నారుల సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక, గతేడాది మేలో ఇదే సరస్సులో పడవ మునిగిపోయిన ఘటనలో 10 మంది చనిపోయారు. పదేళ్ల కిందట 2010 జులైలో కాంగో పశ్చిమ ప్రావిన్సుల్లోని బందుడూలో పడవ మునిగి 135 మంది జలసమాధి అయ్యారు.


By February 16, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-60-people-killed-several-missing-as-boat-capsizes-in-congo-river/articleshow/80956357.cms

No comments