ఉత్తరాఖండ్: క్షణాల్లో కొట్టుకుపోయిన కార్మికులు.. షాకింగ్ వీడియో


ఎత్తైన కొండలు. వాటిపై కంటికి ఇంపుగా కనిపించే మంచు చరియలు. ఆ కొండల మధ్య నుంచి అందంగా ప్రవహించే అలకనందా నది. ఆ నదిపై విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టారు. కొంత మంది కార్మికులు రోజూలాగే ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో అలజడి. నందాదేవీ హిమనీనదం పెల్లుబుకింది. పెద్ద శబ్దంతో విరిగిపడ్డ మంచు చరియలు నేరుగా వెళ్లి కింద ప్రవహిస్తున్న ధౌలీగంగా నదీ ప్రవాహంలో పడ్డాయి. తెల్లటి పొగమంచులా బయల్దేరి జలధార ప్రళయభీకరంగా మారింది. ఉప్పెనై ఎగిసిపడింది. అడ్డుగా ఉన్న కొండరాళ్లను చెల్లాచెదురు చేస్తూ ముందుకు దూకింది. నది మధ్యలో ఉన్న పవర్ ప్రాజెక్టును తునాతునకలు చేసింది. ఆ ప్రవాహ దాటికి అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కొట్టుకుపోయారు. దేవభూమిగా పేరుపొందిన ఉత్తరాఖండ్‌లో ఆదివారం (ఫిబ్రవరి 7) నాడు జలప్రళయం సృష్టించిన బీభత్సమిది. ఈ ప్రమాదానికి సంబంధించి తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పైభాగంలో పనిచేస్తున్న కార్మికులను జలప్రవాహం ఒక్కసారిగా కమ్మేసింది. బురదతో కలిసిన నీరు వారిని చుట్టేసింది. తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. ఆ బురద నీటి ప్రవాహంలో అక్కడున్న కార్మికులందరూ క్షణాల వ్యవధిలో కొట్టుకుపోయారు. షాకింగ్ వీడియో.. తపోవన్ టన్నెల్ వద్ద కెమెరాకు చిక్కిన ఈ దృశ్యాలను ఐటీబీపీ విడుదల చేసింది. నాటి వరద బీభత్సానికి ఈ వీడియో సజీవ సాక్ష్యంగా ఉంది. కోట్లాది గుండెలను మెలిపెడుతోంది. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో మొత్తం 203 మంది గల్లంతయ్యారు. తపోవన్ టన్నెల్‌లో చిక్కుకున్న 12 మందిని ఐటీబీపీ సిబ్బంది రక్షించారు. ఇప్పటివరకు 32 మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగాల్లో పేరుకుపోయిన బురద రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. భారీ యంత్రాలతో బురదను తొలగిస్తున్నారు. Also Read: ✦ ✦
By February 10, 2021 at 05:21PM
No comments