Breaking News

మిస్ ఇండియాగా తెలుగమ్మాయి మానస.. రన్నరప్‌గా ఆటోడ్రైవర్ కూతురు!


అందాల సుందరి పోటీల్లో మరోసారి తెలుగందం మెరిసి మురిసింది. ఈ ఏడాది మిస్ ఇండియాగా తెలుగమ్మాయి కిరీటం దక్కించుకుంది. బుధవారం రాత్రి ముంబై వేదికగా జరిగిన ఫైనల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన (23) ఫెమినా మిస్‌ ఇండియా 2020గా నిలిచింది. తొలిసారి వర్చువల్‌ విధానంలో ఈ పోటీలు జరిగాయి. పోటీ ఆద్యంతం మానస.. తన అందం, తెలివితేటలతో న్యాయనిర్ణేతలను మెప్పించింది. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న మిస్‌ వరల్డ్) పోటీలకు భారత్ తరఫున మానస ప్రాతినిధ్యం వహించనున్నారు. హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పాఠశాల విద్య, వాసవి కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన మానస.. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ సంస్థలో ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఎక్ఛేంజ్‌ ఎనలి‌స్ట్‌గా పనిచేస్తోంది. చిన్నతనంలో మానసకు బిడియం ఎక్కువ. తనను తాను వ్యక్తీకరించుకోవడానికి కూడా సిగ్గుపడే ఓ అమ్మాయి మిస్‌ ఇండియాగా మారడం వెనుక స్ఫూర్తి కలిగించిన అంశం ఏంటని అడిగితే.. ‘తెలుసుకోవాలన్న ఉత్సుకతే’ అన్నది ఆమె సమాధానం. సంగీతం, భరతనాట్యంలో మానస ప్రావీణ్యం సంపాదించిన మానస.. తన జీవితంపై అమ్మ, అమ్మమ్మ, సోదరి ప్రభావం చాలా ఎక్కువని పేర్కొంది. నటి ప్రియాంక చోప్రాను చూసి స్ఫూర్తి పొందానని చెబుతోంది. బదిరుల (సైగలు) భాషను నేర్చుకున్నానన్న మానస, తన ఆనందం కోసమే దాన్ని నేర్చుకున్నానని ఇన్‌స్టాలో వెల్లడించింది. జీవితంలో ఆటుపోట్లు సహజమని.. స్వీయ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదని స్పష్టం చేస్తోంది. ఈ పోటీల్లో హరియాణాకు చెందిన మానికా షియోకండ్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. రన్నరప్‌గా నిలిచిన మాన్యా సింగ్ తండ్రి ఓ ఆటో డ్రైవర్ కావడం విశేషం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఎంతగానో శ్రమించిన తర్వాత తనకు దక్కిన విజయం ఎంతో విలువైందని మాన్యా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, అయితే ఇతరుల నుంచి ప్రేరణ పొంది ముందుకెళ్లానని పేర్కొంది. ‘నా రక్తం, చెమట, కన్నీళ్లు నా కలలను కొనసాగించే ధైర్యంగా కలిసిపోయాయి’ అని మాన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. యూపీలో కుషీనగర్‌కు చెందిన మాన్యాది నిరుపేద కుటుంబం. కొన్నిసార్లు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఎదుర్కొంది. ఆహారం, నిద్ర లేకుండా రాత్రులు గడపడం.. కొన్ని రూపాయలు ఆదా చేయడానికి మైళ్లు దూరం నడవడం.. విలువైన పుస్తకాలు, బట్టల కోసం ఆరాటపడినా అదృష్టం తనకు కలిసి రాలేదు అని చెప్పింది. ఇంట్లోని నగలు తాకట్టు పెట్టి పరీక్ష ఫీజు కట్టిన రోజులను మాన్యా గుర్తుచేసుకుంది. అన్ని సమస్యల పరిష్కారానికి విద్య బలమైన ఆయుధమని తాను బలంగా నమ్ముతానని తెలిపింది. నా కలలను సాకారం చేసుకుని తల్లిదండ్రులు, సోదరుడికి మంచి జీవితం ఇచ్చి, తానేంటో ప్రపంచానికి నిరూపించడానికి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నానని మాన్య వ్యాఖ్యానించారు.


By February 12, 2021 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-student-manasa-varnasi-winner-of-miss-india-2020-rickshaw-driver-daughter-runner-up/articleshow/80872897.cms

No comments