Breaking News

ట్రంప్ చుట్టూ బిగిస్తోన్న ఉచ్చు.. కీలక వీడియోను విడుదల చేసిన డెమొక్రాట్లు!


క్యాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ఉసిగొల్పారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ట్రంప్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ట్రంప్‌ను అభిశంసించే దిశగా వాదనలు బలంగా వినిపిస్తోన్న డెమొక్రాట్లు.. దాడికి సంబంధించి ఓ కీలక వీడియోను తాజాగా బయటపెట్టారు. మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులపైకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడం, పోలీసులపై దాడికి దిగడం వంటివి ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసులో వీడియో బలమైన సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు, అభిశంసన తీర్మానంపై సెనేట్‌లో బుధవారం విచారణ ప్రారంభమైంది. మాజీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా జామీ రస్కిన్‌ సహా పలువురు డెమొక్రాటిక్‌ నేతలు గట్టిగా వాదనలు వినిపించారు. ట్రంప్‌ అమాయకుడు కాదని రస్కిన్‌ పేర్కొన్నారు. దేశాధినేతగా తాను నిర్వర్తించాల్సిన విధులను ట్రంప్ విస్మరించారని మండిపడ్డారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని పరిరక్షిస్తానంటూ చేసిన ప్రమాణాన్నిట్రంప్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల్లో బైడెన్‌ విజయాన్ని కాంగ్రెస్‌ ధ్రువీకరించకుండా అడ్డుకోవడానికి మద్దతుదారులను రెచ్చగొట్టారని దుయ్యబట్టారు. డెమొక్రాట్ల వాదనల అనంతరం ట్రంప్‌ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. అభిశంసన తీర్మానంపై విచారణకు సెనేట్‌లో ఆరుగురు రిపబ్లికన్లు మద్దతు తెలపడం గమనార్హం. భారతీయ అమెరికన్‌ సభ్యులు రాజా కృష్ణమూర్తి, అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ అభిశంసన తీర్మానంపై విచారణ ప్రారంభానికి మద్దతుగా నిలిచారు. మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌, స్పీకర్ నాన్సీ పెలోసీల కోసం ఆందోళనకారులు ఆగ్రహంతో వెతుకుతున్నట్టు ఈ వీడియోలో కనిపించింది. ట్రంప్ మద్దతుదారుల దాడితో చట్టసభ్యులు కలవరపడటం, పెన్స్‌ సహా ఆయన కుటుంబ సభ్యులను సురక్షితంగా అధికారులు అక్కడి నుంచి తీసుకెళ్లడం, పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడం, ‘పెన్స్‌ను ఉరి తీయండి’ అంటూ నినాదాలు చేయడం వంటి దృశ్యాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ బయటకు రాని ఓ ఆడియో క్లిప్‌ను కూడా డెమొక్రాటిక్‌ నేతలు బయటపెట్టారు. క్యాపిటల్‌ హిల్‌ వద్ద ఆందోళనకారుల దాడిలో గాయపడిన పోలీసులు చేసిన హాహాకారాలు అందులో వినిపించాయి. ‘వాళ్లు మా పైకి ఇనుప కడ్డీలు విసురుతున్నారు’అంటూ ఓ పోలీసు చెప్పడం, అదనపు బలగాల కోసం విన్నవించడం వంటివి అందులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, గతంలో ట్రంప్‌పై చేసిన అభిశంసన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే.


By February 12, 2021 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-former-president-trump-impeachment-trial-democrats-releases-latest-video-of-capitol-hill-violence/articleshow/80873354.cms

No comments