Breaking News

సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా‌కు అమెరికా ఆమోదం


జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను అత్యవసర వినియోగం కింద అమెరికా కీలక నిర్ణయం తీసుకోనుంది. సురక్షితం, ప్రభావవంతమైన ఈ టీకాకు అత్యవసర ఆమోదం పొందే అన్ని అర్హతలు ఉన్నాయని నిపుణుల బృందం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు సిఫారసు చేసింది. మొత్తం మీద ఈ వ్యాక్సిన్ 66 శాతం ప్రభావశీలతను చూపుతున్నట్టు తెలిపింది. ప్రత్యేకించి తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన వారిపై ఇది 85 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని పేర్కొంది. ఎఫ్‌డీఏ సలహా బృందంలోని నిపుణులంతా ఏకగ్రీవంగా చేసిన ఈ సిఫారసు ఆధారంగా త్వరలోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు అనుమతులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు అనుమతులు లభించగానే.. మార్చి 1 నుంచి ఈ టీకా పంపిణీకి జాన్సన్ అండ్ జాన్సన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. వివిధ దేశాల్లో విజృంభిస్తోన్న దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌పై ఈ టీకా 81.7 శాతం, బ్రెజిల్ స్ట్రెయిన్‌పై 87.6 శాతం సమర్ధత చూపడం విశేషం. ‘ఇది అమెరికన్లందరికీ ఉత్తేజకరమైన వార్త, సంక్షోభాన్ని అంతం చేయడానికి మా ప్రయత్నాలలో ప్రోత్సాహకరమైన అభివృద్ధి’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. కానీ, ఈ సమయంలో కొత్త స్ట్రెయిన్‌ల నుంచి ముప్పు పొంచి ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని బైడెన్ సూచించారు. భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను పాటించాలని తెలిపారు. ‘కానీ మనం ఇప్పుడు మన రక్షణను తగ్గించలేం.. విజయం అనివార్యమని అనుకోలేం’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. క్లినికల్ ట్రయల్స్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 39,321 మంది పాల్గొనగా.. 85.4 శాతం సమర్ధత చూపింది. ఇప్పటికే అమెరికాలో ఫైజర్, మోడెర్నా టీకాలకు ఆమోదం లభించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 65 మిలియన్ల మందికి అమెరికాలో టీకా వేశారు. ఇక, భారత్‌లో ఈ టీకాల ఉత్పత్తిని హైదరాబాద్‌లోని బయొలాజికల్‌-ఈ కంపెనీ చేపట్టనుందని జాన్సన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సార్థక్‌ రణడే వెల్లడించారు. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. భారత్‌లో ఏటా 60 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.


By February 28, 2021 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-fda-clears-johnson-johnson-single-shot-covid-vaccine-for-emergency-use/articleshow/81253763.cms

No comments