Breaking News

భారత్‌కు అనుకూలంగా సైన్యం ఉపసంహరణ.. పలు ప్రాంతాలను వీడనున్న చైనా


సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య తొమ్మిది నెలలుగా కొనసాగిన ప్రతిష్టంభన క్రమంగా వీడుతోంది. ఇరు దేశాలూ ఓ అవగాహనకు వచ్చి బలగాలను వెనక్కు మళ్లిస్తున్నాయి. పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్‌, చైనా బలగాల ఉపసంహరణ.. నిర్దేశిత రీతిలో కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సరస్సు ఉత్తర తీరంలో బంకర్లు, తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను చైనా సైన్యం తొలగించిందని పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో క్రమంగా బలగాలను వెనక్కు మళ్లిస్తున్నాయని వివరించాయి. ఉపసంహరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇరు దేశాల సైనికాధికారులు నిత్యం సమావేశమవుతున్నాయని వ్యాఖ్యానించాయి. బలగాలు, యుద్ధట్యాంకుల ఉపసంహరణపై రెండు పక్షాలూ పరిశీలన సాగిస్తున్నాయని, ప్రక్రియ పూర్తయిన తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల తగ్గింపు అంశంపై రెండు దేశాలు చర్చలు జరుపుతాయని పేర్కొన్నాయి. పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న క్లిష్టమైన ఫింగర్ వ్యూహాత్మక ప్రాంతాలను భారత్ వదులుకుంటుందనే ఆందోళన అర్ధరహితమని, ఇప్పుడు హెలిప్యాడ్ సహా మౌలిక సదుపాయాలను చైనా తొలగిస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. దక్షిణ ఒడ్డున ఉన్న వ్యూహాత్మక ప్రాంతాల నుంచి వైదొలగడానికి సీపీఎల్ఏ అంగీకరించడం కీలకమైన అంశం. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ విషయంలో పరస్పర అంగీకారానికి వచ్చామని, క్రమంగా ఉద్రిక్తతలను తగ్గిస్తామని చైనా అంతకు ముందు తెలిపింది. సైన్యం ఉపసంహరణలో భాగంగా గతేడాది మే మొదటి వారానికి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని భారత్ స్పష్టం చేసింది. పీఎల్‌ఏ దళాలు ఫింగర్ 8 కి తూర్పున ఉన్నాయని సైనిక వర్గాలు నిర్ధారించాయి. ఫింగర్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయకూడదనే నిర్ణయం భారత్ తన హక్కులను పోగొట్టుకున్నట్లు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని తెలిపాయి. ఉపసంహరణ ప్రక్రియ భారత్‌కు అనుకూలంగా సాగుతోందని వివరించాయి.


By February 16, 2021 at 07:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lac-row-disengagement-in-indias-favour-china-will-vacate-most-prickly-parts/articleshow/80955070.cms

No comments