Breaking News

రాజస్థాన్: బీజేపీ మాజీ అధ్యక్షుడి కుటుంబంలో నలుగురు బలవన్మరణం


రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, దివంగత మదన్‌లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన సోదరుడి కుమారుడు, భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. మదన్‌లాల్ సైనీ 2019లో మృతి చెందారు. ఆత్మహత్యకు పాల్పడినవారిలో హనుమాన్ ప్రసాద్, ఆయన భార్య తార, వారి ఇద్దరు కుమార్తెలు అంజు, పూజ ఉన్నారు. వీరంతా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హనుమాన్ ప్రసాద్ పెద్ద కుమారుడు (17) గతేడాది సెప్టెంబరులో మృతి చెందాడు. అప్పటి నుంచి వీరంతా తీవ్రమైన మానసిక వేదనలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కున్వర్ రాష్ట్రదీప్ అక్కడకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను సికర్‌లోని శ్రీ కల్యాణ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుమారుడు లేకుండా జీవించడం కష్టమని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశారని పోలీసులు వివరించారు. హనుమాన్ ప్రసాద్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం గురించి తమకు గ్రామ పూజారి ఫోన్ చేసి చెప్పాడని సికర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర శర్మ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకునే సరికి నలుగురూ ఉరికి వేలాడుతూ ఉన్నారని పేర్కొన్నారు. కు మారుడు చనిపోయిన తర్వాత వీరంతా మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆత్మహత్యకు అదే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. బీజేజీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దివంగత మదన్‌లాల్‌ సైనీ సోదరుడి కుమారుడే హనుమాన్ ప్రసాద్ అని పోలీసులు తెలిపారు. మదన్‌లాల్ సైనీ 2018 జూన్ నుంచి రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటికి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. వసుంధరా రాజే సింధియా సీఎంగా కొనసాగుతున్నారు. అయితే, ఆయన 2019 జూన్‌లో అనారోగ్య కారణాలతో మృతిచెందారు.


By February 22, 2021 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-of-former-bjp-state-president-madanlal-saini-relatives-death-in-rajasthan/articleshow/81145489.cms

No comments