Breaking News

ముంబయి: మళ్లీ పెరుగుతున్న కోవిడ్.. వారికి స్టాంపింగ్, అపార్ట్‌మెంట్స్‌ సీల్!


మరోసారి కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలను కఠినతరం చేసి, వాటిని ఉల్లంఘించినవారి చర్యలు తీసుకోవాలని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గురువారం నిర్ణయించింది. బిల్డింగ్‌లు సీల్, లక్షణాలు బయటపడని కరోనా బాధితులకు స్టాంపింగ్, హైరిస్క్ కాంటాక్ట్‌లను గుర్తించడం వంటి నిబంధనలు తిరిగి ప్రారంభించనున్నారు. మాస్క్ ధరించనివారికి జరిమానా వంటి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.. ముంబయి నగరంలో వ్యాప్తి కట్టడికి కొన్ని చర్యలు తీసుకున్నామని, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. గురువారం మధ్యాహ్నం అన్ని బీఎంసీ వార్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ముంబయి నగరంలో 42 వరుసగా రెండు రోజులు 700కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బీఎంసీ అప్రమత్తమయ్యింది. గతంలో కోవిడ్ కట్టడికి అనుసరించిన విధానాలనే ప్రస్తుతం అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఐదు కంటే ఎక్కువ కేసులు నమోదయిన ప్రాంతాలను సీల్ చేయడం, లక్షణాలు బయటపడని కోవిడ్ రోగులకు స్టాంపింగ్ వంటివి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. అసిమ్టమాటిక్ రోగులు హోం క్వారంటైన్‌లో ఉండకుండా నిబంధనలు ఉల్లంఘించిన బయట తిరిగితే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇటువంటి రోగులను తప్పనిసరిగా వ్యవస్థాగత క్వారంటైన్‌కు తరలిస్తారు. ఎవరైనా మాస్క్ లేకుండా బయట తిరిగితే జరిమానా విధించాలని వార్డు అధికారులకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ దిశ నిర్దేశం చేశారు. తప్పనిసరిగా అందరూ మాస్క్‌లు ధరించాలని, దీనిని ఉల్లంఘిస్తే రూ.200 జరిమానా విధిస్తామని తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మాస్క్ జరిమానాలతో బీఎంసీకి రూ.30.96 కోట్ల సమకూరింది. ‘మిషన్ మళ్లీ ప్రారంభమయ్యింది.. చాలా మంది పౌరులు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్క ధరించకుండా తిరుగుతున్నారు.. ఇది వారికి మాత్రమే కాదు సన్నిహితంగా మెలిగేవారికి కూడా ప్రమాదం.. ప్రజా ప్రయోజనం దృష్ట్యా బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్లూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి’ అని ఇక్బాల్ సింగ్ అన్నారు. మాస్క్ నిబంధనలు ఉల్లంఘించేవారిని పరిశీలనకు ప్రస్తుతం ఉన్న 2,400 మందిని రెట్టింపు చేశారు. మొత్తం 4,800 మందిని అధికారులు నియమించారు.


By February 19, 2021 at 07:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/once-again-covid-19-cases-to-soar-up-stamping-sealing-back-in-mumbai/articleshow/81101443.cms

No comments