ట్రంప్ 2024లో అధ్యక్షుడైనా సరే అనుమతించం.. ట్విట్టర్ సంచలన ప్రకటన


జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై మద్దతుదారులు దాడికి పాల్పడిన తర్వాత ఆయన ఖాతాను ట్విట్టర్ నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, డొనాల్డ్ ట్రంప్‌ను భవిష్యత్తులోనూ అనుమతించేది లేదని ట్విట్టర్ తేల్చిచెప్పింది. క్యాపిటల్ భవనంపై దాడికి ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో ట్రంప్ ఖాతాను ట్విట్టర్ ‘డీ ప్లాట్‌ఫామింగ్’ చేసింది. ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియా సంస్థలు కూడా ఆయనపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. హింసకు పాల్పడేలా ఎవరు ప్రేరేపించినా.. వారిని తమ వేదిక నుంచి తొలగించటమే కాకుండా తిరిగి రానివ్వబోమని ట్విట్టర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్ స్పష్టం చేశారు. ‘మా విధానాల ప్రకారం ప్లాట్‌ఫాం నుంచి ఒకసారి ఒకరిని తొలగించామంటే దాని అర్ధం జీవితకాల నిషేధమే.. అది ఓ విమర్శకుడైనా, ఏదైనా సంస్థ సీఎఫ్‌ఓ అయినా, ప్రస్తుతం లేదా ఇదివరకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా మా సంస్థ నియమాలు ఒకే విధంగా ఉంటాయి’ అని సీఎన్‌బీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెడ్ సెగాల్ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా.. ఆయనను ట్విటర్‌లోకి తిరిగి అనుమతించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించేందుకు ఎక్కువగా ట్విటర్‌పై ఆధారపడ్డారు. అంతేకాదు, రాజకీయ ప్రచారానికి, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు కూడా ఆయన ఈ మాధ్యమాన్నే ఉపయోగించేవారు. కాగా, ట్విట్టర్ నుంచి ఆయనను తొలిగించే నాటికి ఎనిమిది కోట్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అధికారిక ఖాతా నుంచి తొలగించిన తర్వాత ఇతర అకౌంట్‌ల నుంచి ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే, వీటిని ట్విట్టర్ తొలగించింది. హింసకు ప్రేరేపించారనే ఆరోపణలపై ట్రంప్ అభిశంసన విచారణ కాంగ్రెస్‌లో జరుగుతుండగా సెగల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ట్రంప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తే అధ్యక్ష పదవి లేదా రాజ్యాంగ బద్ధమైన పదవిని చేపట్టకుండా నిరోధించలేరు. కానీ ట్రంప్ తన అభిమాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మాత్రం కనిపించరు. గత నెలలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే మాట్లాడుతూ.. ట్రంప్ ఖాతా విషయంలో తీసుకున్న నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు.
By February 11, 2021 at 01:09PM
No comments