Breaking News

కోవిడ్‌ వ్యాప్తిని కావాలనే దాచిపెట్టారు.. WHO టీమ్‌ను కలవకుండా ఆంక్షలు: చైనీయుడు సంచలన వ్యాఖ్యలు


మహమ్మారి మూలాలపై దర్యాప్తులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్వతంత్ర బృందం వుహాన్‌లో పర్యటిస్తోంది. వైరస్ విషయంలో చైనా గుంభనంగా వ్యవహరించి, ప్రపంచ మహమ్మారిగా మారడానికి కారణమయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ బృందం రంగంలోకి దిగిన వేళ.. ఓ చైనా పౌరుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తనకు డబ్ల్యూహెచ్‌వో బృందాన్ని కలిసే అవకాశం ఇస్తే వైరస్‌ వ్యాప్తి విషయంలో వుహాన్ అధికారులు చేసిన కుట్రలను వివరిస్తానని ఝంగ్‌ హై అనే వ్యక్తి పేర్కొన్నారు. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిపై దాచిపెట్టడం వల్లే మహమ్మారికి తన తండ్రి బలయ్యాడని ఝంగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఝంగ్‌ కుటుంబం తన తండ్రికి ఓ శస్త్రచికిత్స కోసం గత జనవరిలో షెన్‌ఝెన్‌ నుంచి వుహాన్‌కు వచ్చింది. అక్కడ ఝంగ్ తండ్రి కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. వుహాన్‌లో కరోనా వ్యాప్తి ఉందన్న విషయం ముందే చెప్పి ఉంటే, తమ కుటుంబం అక్కడకు వచ్చేది కాదని, తమ తండ్రి మరణించేవాడు కాదని ఝంగ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విషయాన్ని దాచిపెట్టడం వల్లే వేలాది మంది చనిపోయారని, ఇవి చైనా ప్రభుత్వం తెలిసి చేసిన హత్యలని దుయ్యబట్టారు. ఆ నేరానికి వారు బాధ్యత వహించాలని, తనకు అధికారికంగా క్షమాపణలు చెప్పేవరకూ వదిలే ప్రసక్తేలేదని అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఏకం చేస్తూ ఆన్‌లైన్‌ వేదికగా తను చేస్తోన్న పోరాటాన్ని అణదొక్కడానికి అధికారులు ప్రయత్నించారని ఝంగ్‌ ధ్వజమెత్తారు. వుయ్‌చాట్‌లో 80-100 మంది సభ్యులున్న తమ గ్రూప్‌ను ఎలాంటి వివరణ లేకుండానే పది రోజుల కిందట డిలీట్‌ చేసి, వీబోలో ప్రారంభించిన ఆరు ఖాతాలను రద్దు చేశారని చెప్పారు. గత నవంబరులో తనను పోలీస్‌ స్టేషన్‌కు కూడా పిలిపించి హెచ్చరించారని, అయితే తాను భయపడనని స్పష్టం చేశారు. నా ఒక్కరిదే కాదు, కరోనా బాధిత కుటుంబాల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారని పేర్కొంది. ‘ ఇది వారు (చైనా అధికారులు) చాలా ఆందోళనగా ఉన్నారనడానికి నిదర్శనం.. బాధిత కుటుంబాలు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులను కలుస్తారేమోనని భయపడుతున్నారు’ అన్నారు. జనవరి 14న వుహాన్‌కు చేరుకోగా.. నిబంధనల ప్రకారం వారి 14 రోజులు క్వారంటైన్‌ గురువారంతో ముగిసింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ బృందం దర్యాప్తు మొదలయ్యింది. నిపుణులు వుహాన్ చేరుకోవడంతో బలవంతంగా సోషల్ మీడియా గ్రూప్‌లను అధికారులు రద్దు చేస్తున్నారని ఝంగ్ ఆరోపించారు. చైనా అధికారిక లెక్కల ప్రకారం కరోనాతో మొత్తం 4,636 మంది చనిపోగా.. ఒక్క వుహాన్ నగరంలోనే 3,900 మంది ప్రాణాలు కోల్పోయారు. గత జనవరిలో తన కుమార్తె కరోనాతో చనిపోయిందని, తనను మీడియా లేదా ఇతర వేదికలపై మాట్లాడవద్దని గతవారం అధికారులు హెచ్చరించినట్టు ఓ మహిళ పేర్కొంది. అంతేకాదు, మంగళవారం తన ఇంటికి వచ్చిన అధికారులు.. కరోనా బాధిత కుటుంబానికి పరిహారం కింద 5,000 యువాన్లు (775 డాలర్లు) ఇస్తామని పాత పాటే పాడారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆమె పేర్కొన్నారు.


By January 29, 2021 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/wuhan-next-of-kin-say-china-silencing-them-as-who-visits-says-chinese-citizen/articleshow/80550012.cms

No comments