Breaking News

యూపీలో యువకుల పైశాచికం..డాల్ఫిన్‌‌ను దారుణంగా కొట్టి


ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది. కొందరు యువకులు ఓ డాల్ఫిన్‌ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. డిసెంబరు 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో కొందరు యువకుల డాల్ఫిన్‌ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించి చంపిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని కొఠారియా గ్రామ సమీపంలోని శారద కెనాల్‌లో చేపల వేటకు వెళ్లిన యువకుల వలకు 5 అడుగుల పొడవున్న చిక్కింది. దానిని పెద్ద చేపగా భావించిన యువకులు వల లాగిన తర్వాత చూసి నిరుత్సాహానికి గురయ్యారు. అది డాల్ఫిన్ అని, అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు పనికిరాదని తెలిసి కోపంతో రగిలిపోయారు. అందరూ కలిసి కర్రలతో కొడుతూ గొడ్డలితో నరికేశారు. ఈ దారుణాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి.. దాన్ని ఎందుకలా హింసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ దుర్మార్గులు కనికరించలేదు. కత్తులతో దాని శరీరాన్ని రెండుగా చీల్చేసి చనిపోయిందని నిర్ధారించుకున్నాక యువకులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన ఓ యువకుడు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పోలీసులు కొఠారియా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. డాల్ఫిన్‌ను జాతీయ జల జంతువుగా ప్రకటిస్తూ 2009లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. డాల్ఫిన్‌ను హింసించినా, చంపినా వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 9/51 ప్రకారం శిక్షార్హమైన నేరం.


By January 09, 2021 at 01:12PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/dolphin-beaten-to-death-by-youth-in-uttar-pradesh-caught-on-camera-3-arrested/articleshow/80185285.cms

No comments