Breaking News

‘మాస్టర్’ షాకింగ్ రివ్యూ: తలనొప్పి.. ఒకే ఒక్క స్టారేసిన విమర్శకుడు


దళపతి విజయ్ సినిమా వస్తుందంటే చాలు అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌కు అంత మార్కెట్ లేకపోయినా తమిళనాడులో వసూళ్లలో ఆయనే నంబర్ వన్. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ‘అదిరింది’, ‘విజిల్’ సినిమాలతో తెలుగులోనూ విజయ్‌కు ఫాలోయింగ్ పెరిగింది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా 9 నెలల పాటు థియేటర్లు మూతబడటంతో తమ హీరోను మళ్లీ తెరపై చూడటానికి ఆత్రుతగా వేచి చూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో భారీ అంచనాల నడుమ ‘మాస్టర్’ సినిమా విడుదలైంది. సంక్రాంతి కానుకగా 13న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వినిపిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందంటూ టాక్ వస్తోంది. అయితే, బాలీవుడ్‌కు చెందిన సినీ విమర్శకుడు శివ సత్యం ‘మాస్టర్’ సినిమాకు ఘోరమైన రేటింగ్ ఇచ్చారు. ఆయన రివ్యూ విజయ్ అభిమానులతో పాటు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో ‘తలనొప్పి’ సినిమా అని తీసిపారేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన రివ్యూను వెల్లడించారు. డబ్బు, సమయం, ప్రతిభ అన్నీ దండగయ్యాయని శివ సత్యం విమర్శించారు. విజయ్ కెరీర్‌లో ఇదొక చెత్త సినిమా అని పేర్కొన్నారు. స్క్రీన్‌ప్లే బాగోలేదని, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కవైపోయాయని, దర్శకత్వం పరమ చెత్తగా ఉందని ఘోరంగా విమర్శించారు. ఎడిటింగ్ కూడా అస్సలు బాగాలేదని, కథ కూడ ఊహాజనితంగా ఉందని వెల్లడించారు. సినిమాను ఫ్లాప్‌గా తేల్చిన సత్యం.. ఒకే ఒక్క స్టార్ రేటింగ్ ఇచ్చారు. కాగా, సత్యం రివ్యూపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు, సత్యం రివ్యూలు నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. ఇదే సత్యం రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. అలా అని ఈయన రివ్యూలు అన్ని సినిమాలకు ఫెయిల్ అవ్వలేదు. కిందటేడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలకు 3.5 స్టార్స్ చొప్పున రేటింగ్ ఇచ్చారు. ఈ రెండూ సంక్రాంతి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’కి 2.5 రేటింగ్ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఆ సినిమా కూడా ఆడింది. ‘భీష్మ’కు 3.25 రేటింగ్ ఇచ్చారు.. అదీ హిట్టు. మరి ఇప్పుడు ఆయన ‘మాస్టర్’కు ఇచ్చిన రేటింగ్ నిజమవుతుందా.. లేకపోతే ఆయన రివ్యూ తప్పని తేలుతుందా చూడాలి!


By January 13, 2021 at 10:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bollywood-critic-shiva-satyam-utterly-criticized-vijay-master-movie/articleshow/80244524.cms

No comments