Breaking News

‘అలా తాకితే లైంగిక వేధింపులు కాదు’.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం సంచలన నిర్ణయం


చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపులుగా పరిగణించలేమని నాగ్‌పూర్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం స్టే విధించింది. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసును జారీ చేసిన ధర్మాసనం.. నాగ్‌పూర్‌ బెంచ్‌ తీర్పుపై అప్పీలకు ఏజీకి అనుమతి ఇచ్చింది. మైనర్ బాలికపై 39 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాంబే హైకోర్టు (నాగ్‌పూర్ బెంచ్‌) జస్టిస్‌ పుష్పా గనేడివాలా ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పోక్సో చట్టం ప్రకారం బాలిక ఛాతీ భాగాన్ని దుస్తులపై కాకుండా శరీరంతోనే తాకితేనే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాదు, నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేశారు. ఈ తీర్పును అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాంబే హైకోర్టు వ్యాఖ్యలు ఆందోళనకరమని, భవిష్యత్తులో ఇది ప్రమాదకరంగా మారే అవకాశముందని వివరించారు. అటార్నీ జనరల్ అభ్యర్థనను స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. నిందితుడికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. 2016లో నిందితుడు సతీష్‌.. బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారి ప్రయివేట్ బాగాలను తాకి దుస్తులు విప్పడానికి యత్నించాడు. అతడి చేష్టలకు భయపడిపోయిన చిన్నారి కేకలు వేయడంతో తల్లి అక్కడికి చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కింది కోర్టు దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ బాలిక ఛాతీభాగాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని వ్యాఖ్యానించింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. ఈ తీర్పుపై మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేశాయి.


By January 28, 2021 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-stays-bombay-high-courts-no-skin-touch-no-sexual-assault-verdict-in-pocso-case/articleshow/80492049.cms

No comments