Breaking News

ఆకట్టుకున్న బైడెన్ తొలి ప్రసంగం.. శ్వేతసౌధంలో సత్తాచాటిన తెలుగోడు!


అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం... కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌ హిల్‌ వెలుపల ఏర్పాటుచేసిన వేదిక వద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. జో బైడెన్‌తో ప్రమాణం చేయించారు. దీంతో అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షునిగా ఆయన నిలిచారు. భార్యతో కలిసి తీసుకొచ్చిన 127 సంవత్సరాల నాటి కుటుంబ బైబిల్‌పై జో ప్రమాణం చేశారు. డేలావేర్‌ సెనేటర్‌గా ఏడుసార్లు, ఉపాధ్యక్షునిగా రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన ఇదే బైబిల్ ఉపయోగించారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగాన్ని మన తెలుగు వ్యక్తి వినయ్ రెడ్డి రాయడం విశేషం. దీంతో రాసిన తొలి భారతీయ అమెరికన్‌గా వినయ్ చరిత్ర సృష్టించారు. ‘అమెరికా యునైటెడ్’ థీమ్‌తో ఆయన ఈ ప్రసంగాన్ని రాశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జో పేర్కొన్న పలు అంశాలను ఇందులో మేళవించారు. ఒబామా హయాంలో రెండోసారి ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్య ప్రసంగ రచయితగానూ వినయ్ పనిచేశారు. ఒహియోలోని డేటన్‌లో వినయ్ నివసిస్తున్నారు. ‘ఈ రోజు మనం వేడుక నిర్వహించుకుంటున్నది ఒక వ్యక్తి విజయం సాధించినందుకు కాదు.. ప్రజాస్వామ్యం గెలుపొందినందుకు. ప్రజాస్వామ్యం విలువైందనీ, సున్నితమైందనీ మనం మరోసారి తెలుసుకున్నాం.. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆశలు చిగురించిన రోజు. ప్రపంచ శాంతి, ప్రగతి, భద్రతలో విశ్వసనీయ భాగస్వామిగా ఉంటాం’ అని బైడెన్ తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వృత్తిరీత్యా డాక్టర్‌. 40 ఏళ్ల కింద అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. వినయ్‌రెడ్డి అమెరికాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో బైడెన్‌ స్పీచ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఓ తెలుగు వ్యక్తి అందులోనూ తెలంగాణ వాసి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రసంగాన్ని రాయడం అంటే సాధారణ విషయం కాదు. దీంతో పోతిరెడ్డిపేటలో సంబరాలు అంబరాన్నంటాయి. వినయ్ రెడ్డి బంధువు సాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘మా బాబాయ్ రాసిన విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను.. మా కుటుంబం మొత్తం చాలా గర్వంగా ఉంది’ అన్నారు. స్వగ్రామానికి వినయ్ ఒక్కసారే వచ్చాడని, ఇక్కడ ఆలయంలో పూజలు నిర్వహించాడని సాయిరెడ్డి తండ్రి రాధాకృష్ణ రెడ్డి పేర్కొన్నారు. అక్కడ అంత పెద్ద ఘనత సాధించడం మాకు గర్వంగా ఉందన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ తన బృందంలో 20 మందికిపైగా భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమించారు. వీరిలో 13 మంది మహిళలే కాగా, 17 మంది శక్తిమంతమైన శ్వేతసౌధ కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తించనున్నారు. అమెరికాలో సుమారు 1% మందే ఉన్న భారతీయ అమెరికన్‌ సామాజికవర్గానికి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పదవులు దక్కాయి. పోతిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి మాట్లాడుతూ.. వినయ్ తాత తిరుపతి రెడ్డితో కలిసి 1980వ దశకంలో తాను పనిచేశానని అన్నారు. అప్పట్లో ఆయన గ్రామ సర్పంచ్‌గా ఉన్నారన్నారు. వినయ్ తండ్రి నారాయణ రెడ్డికి మొత్తం ముగ్గురు అబ్బాయి. వినయ్ సోదరులు నవీన్, సృజన్ వైద్యులు.


By January 21, 2021 at 09:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-president-joe-bidens-words-chosen-by-an-indian-vinay-reddy/articleshow/80379187.cms

No comments