Breaking News

నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామని విపక్షాలు ప్రకటన


శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు కూడా కోవిడ్-19 మార్గదర్శకాలు, నిబంధనలు మధ్య జరగనున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు 33 రోజుల పాటు నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు సమర్పించనున్నారు. పేపర్ రహిత బడ్జెట్‌ నేపథ్యంలో అధికారిక పత్రాలను సభకు సమర్పించిన వెంటనే ఆర్థిక సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచుతారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. రెండు విడతలుగా జరిగే సమావేశాల్లో తొలి విడత శుక్రవారం నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8వరకు జరగనున్నాయి. ఈసారి జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయం యధాతథంగా ఉంటాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అన్నిపార్టీల నేతలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. జనవరి 30న ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం, జనవరి 31న రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అన్ని పక్షాల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. గత వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సభ్యులు రెండు సభల్లో ఆసీనులుకానున్నారు. సెంట్రల్‌ హాల్‌లో జరిగే కార్యక్రమానికి పరిమితి సంఖ్యలో 144 మంది సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు సహా 1209 సిబ్బందికి టెస్టులు నిర్వహించినట్టు రాజ్యసభ సచివాలయ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాలు తాము బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు గురువారం సంచలన ప్రకటన చేశాయి. సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని, రిపబ్లిక్ డే రోజు చోటుచేసుకున్న ఘటనలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాయి. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులు ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నాయి. నూతన వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలను ఆమోదింపజేసుకున్నారని దుయ్యబట్టాయి. ఈ మేరకు గురువారం (జనవరి 28) 16 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్.. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు ఈ సమావేశాలను బహిష్కరించనున్నాయి.


By January 29, 2021 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/parliaments-budget-session-gets-underway-today-opposition-to-boycott-presidents-address/articleshow/80544394.cms

No comments