Breaking News

రాజ్‌పథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రఫేల్ జెట్స్, ఆకాశ్ క్షిపణులు


దేశ రాజధాని ఢిల్లీలో 72 వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ప్రధాని వెంట రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ పరిమితి సంఖ్యలోనే రాజ్‌పథ్ వద్ద వేడుకలకు సందర్శకులను అనుమతించారు. ఈ ఏడాది విదేశీ అతిథి లేకుండానే వేడుకలు జరుగుతున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకావాల్సిన ఉన్నా.. అక్కడ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దుచేసుకున్నారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తొలుత శతఘ్ని దళం గాల్లోకి ఫిరంగులను పేల్చింది. గణతంత్ర పరేడ్‌లో ఆకాశ్ క్షిపణులు, రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాది పరేడ్‌కు లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్.. వాయుసేన ఫ్లైపాస్ట్‌కు నాయకత్వం వహించారు. దీంతో రిపబ్లిక్ డే పరేడ్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళా పైలట్‌గా ఆమె నిలిచారు. సైన్యం శక్తి సామర్ధ్యాలను తెలియజేసే బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్లు, అగ్ని మిసైల్స్‌ను ప్రదర్శించారు. రష్యన్‌ టీ-90 యుద్ధ ట్యాంకులు, టీ-72 బ్రిడ్డ్‌-లేయర్‌ ట్యాంక్‌, బీఎంపీ-2 ఆర్మోర్డ్‌ పర్సనల్‌ క్యారియర్‌, పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంఛర్‌, బ్రహ్మోస్‌ క్షిపణులు కవాతులో ఆకట్టుకోనున్నాయి. 1971లో బంగ్లా పోరాటానికి 50 ఏళ్లు పూర్తికాగా... నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు గౌరవంగా.. సైనిక కవాతుకు బంగ్లాదేశీ సాయుధ దళం నేతృత్వం వహించింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి కంటింజెంట్లలో ఉండే సైనికుల సంఖ్యను కుదించారు. ఆర్మీ, నేవీ బృందాల్లో 144 మందికి బదులు 96 మందే పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.


By January 26, 2021 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/president-unfurls-national-flag-at-rajpath-occassion-of-72nd-republic-day-celebrations/articleshow/80461779.cms

No comments