Breaking News

మెగా కాంపౌండ్‌లో విలక్షణ నటుడు.. హ్యాపీ బర్త్‌డే వరుణ్


మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన రెండో తరం హీరోల్లో విలక్షణ నటుడు ఎవరంటే అని చెప్పొచ్చు. మిగిలిన మెగా కుర్ర హీరోలతో పోలిస్తే వరుణ్ తేజ్ చేసిన సినిమాలు తక్కువే అయినా వైవిధ్యమైన పాత్రలు పోషించారాయన. తొలి సినిమా ‘ముకుంద’ మొదలుకొని ‘గద్దలకొండ గణేష్’ వరకు సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపించారు వరుణ్. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ పక్కా కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతున్నా.. వరుణ్ మాత్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు (జనవరి 19న) వరుణ్ తేజ్ పుట్టినరోజు. ఆయన 31వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్‌కు మెగా అభిమానులతో పాటు శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం కూడా వరుణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్‌లో ఆయన ఏడేళ్ల ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. అంతేకాదు, ఈ ఏడేళ్లలో ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ‘కంచె’తో క్రేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. తొలి సినిమా ‘ముకుంద’ మెగా అభిమానులను కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. నటన పరంగా వరుణ్ పర్వాలేదనిపించినా సినిమా కమర్షియల్‌గా హిట్ కాలేదు. కానీ, 2015లో వచ్చిన ‘కంచె’ సినిమా వరుణ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆర్మీ మ్యాన్‌గా, ప్రేమికుడిగా వరుణ్ వైవిధ్యమైన నటనను కనబరిచారు. ధూపాటి హరిబాబు పాత్రలో జీవించారు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ‘లోఫర్’తో మాస్ ఇమేజ్ ‘కంచె’లో క్లాసిక్ లుక్‌లో కనిపించిన వరుణ్ తేజ్‌ను ‘లోఫర్’లో రఫ్‌గా మార్చేశారు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా వరుణ్‌కు మాస్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో వరుణ్ మేనరిజాన్ని పూర్తిగా మార్చేశారు పూరి. అయితే, ఈ సినిమా వరుణ్ కెరీర్ గ్రాఫ్ పైకెళ్లడానికి పెద్దగా ఉపయోగపడలేదు. దీనికి తోడు వెంటనే ‘మిస్టర్’ డిజాస్టర్ కావడంతో వరుణ్ కాస్త ఇబ్బంది పడ్డారు. మలుపుతిప్పిన ‘ఫిదా’ వరుణ్ తేజ్ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం ‘ఫిదా’. ఆయన కెరీర్‌లో పెద్ద హిట్ కూడా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్ఆర్ఐ మెడికల్ స్టూడెంట్‌గా వరుణ్ నటన కొత్తగా అనిపిస్తుంది. దీనికి తోడు వరుణ్ తేజ్, సాయి పల్లవి జోడి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యింది. ‘ఫిదా’తో వరుణ్‌కు లవర్ బాయ్ ఇమేజ్ కూడా వచ్చేసింది. ఈ సినిమాతో వరుణ్ మార్కెట్ పెరిగింది. ఆ తరవాత సంవత్సరమే ‘తొలి ప్రేమ’ సినిమాతో హిట్ అందుకొని మరో మెట్టు ఎక్కారు వరుణ్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా మంచి విజయాన్ని అందుకుంది. ‘అంతరిక్షం’తో ప్రయోగం అప్పటి వరకు రొమాన్స్, యాక్షన్, డ్రామా జోనర్‌లలో సినిమాలు చేసిన వరుణ్.. తొలిసారి సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్‌లో నటించారు. అదే ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పేస్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించారు.. మెప్పించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా వరుణ్ ఖాతాలో ఒక వైవిధ్యమైన చిత్రం చేరింది. ‘F2’తో మల్టీస్టారర్ ‘అంతరిక్షం’ వరకు సోలో హీరోగా సినిమాలు చేసిన వరుణ్ తేజ్.. తొలిసారి మరో స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్‌లో నటించారు. అదే ‘F2’. వరుణ్ తేజ్, వెంకటేష్ కెరీర్‌లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిది. అంతేకాదు, వరుణ్ తేజ్‌లోని కామెడీ కోణాన్ని చూపించిన సినిమా. ఈ సినిమాతో వరుణ్ తేజ్ క్రేజ్ మరో మెట్టు పైకెక్కింది. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ కూడా ఈ చిత్రం తరవాత భారీగా పెరిగింది. ‘గద్దలకొండ గణేష్’తో రౌడీ క్రేజ్ ‘ముకుంద’ నుంచి ‘F2’ వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ‘గద్దలకొండ గణేష్’ మరో ఎత్తు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించారు. గుబురు గెడ్డం, మీసాలు.. రఫ్ లుక్‌లో భయపెట్టే విధంగా కనిపించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రౌడీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు వరుణ్. ఈ సినిమా కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని అందుకుంది. వరుణ్ తేజ్ హీరోగా ఇప్పటి వరకు చేసిన సినిమాలు తొమ్మిది. అయితే, ఈ తొమ్మిది సినిమాల్లోనే వీలైనన్ని ఎక్కువ జోనర్లను ఆయన ప్రయత్నించారు. విజయం సాధించారు. ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో పదో సినిమాను చేస్తున్నారు. అలాగే, మరోసారి విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘F3’లో నటిస్తున్నారు. ‘F2’కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి మరింత ఫన్, ఫ్రస్టేషన్ యాడ్ చేసి రూపొందిస్తున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్‌ విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.


By January 19, 2021 at 09:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-konidela-is-celebrating-his-31st-birthday/articleshow/80340044.cms

No comments