Breaking News

కొంపముంచిన గూగుల్ మ్యాప్.. దారి తప్పి అడవిలో వ్యక్తి మృతి


దారి తెలియని పరిస్థితుల్లో చాలా మంది గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటారు. షార్ట్ కట్ మార్గాలను, ట్రాఫిక్ తక్కువగా ఉన్న దారులను ఎంచుకుంటారు. కానీ, కొన్ని సార్లు నమ్ముకుంటే నట్టేట ముంచుతుంది. ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తుంది. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లోనైతే అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తుంది. అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో జరిగింది. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని పోయిన ఓ వ్యక్తిని డ్యామ్‌లో ముంచేసింది. ఈత రాక అతడు కారుతో పాటు అందులో మునిగిపోయి మృతి చెందాడు. పుణేలోని ఓ ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గురు శేఖర్ (42) తన సహోద్యోగులు సతీశ్ గూలే (34), సమీర్ రాజుర్కర్‌తో కలిసి గత ఆదివారం (జనవరి 10) సరదగా ట్రెక్కింగ్ వెళ్దామని నిర్ణయించుకున్నారు. వారంతా కలిసి ఫార్చ్యూనర్‌ కారులో మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ వద్దకు బయల్దేరారు. మార్గమధ్యలో వాళ్లు దారి తప్పిపోయారు. దీంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించారు. గూగుల్ మ్యాప్ చూపించిన దారి వెంట చాలా దూరం ప్రయాణించారు. అది దట్టమైన అడవిలోకి తీసుకెళ్లింది. అక్కడ దారి కూడా కనపడనంత చీకటి ఉంది. అయినా.. గూగుల్‌ మ్యాప్‌ దారి చూపిస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగారు. చివరికి వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ డ్యామ్ వద్దకు చేరుకుంది. దారి సరిగా కనిపించకపోవడంతో అక్కడ బ్రిడ్జి ఉందనుకొని పొరబడ్డారు. కారును అలాగే ముందుకు పోనిచ్చారు. అంతే.. క్షణాల్లో వాహనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. శేఖర్, సమీర్ ఎలాగోలా కారు డోర్లను తీసుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, సతీశ్‌కు ఈత రాకపోవడంతో కారులోని చిక్కుకొని ప్రాణాలు విడిచారు. శేఖర్, సమీర్ ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే సరికి బాగా ఆలస్యమైంది. మరుసటి రోజు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడికి కొంతదూరంలో కారును, అందులో సతీశ్ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ బ్రిడ్జి ఉందట.. ట్విస్ట్! ప్రమాదానికి గురైన చోట బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమేనని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మాధ్నే తెలిపారు. కానీ, అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందని చెప్పారు. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జిపై నుంచి నీటి ప్రవాహం ఉంటుందని వెల్లడించారు. ఈ బ్రిడ్జికి పైనే పెద్ద డ్యామ్ ఉన్న కారణంగా నీటిని విడుదల చేసినప్పుడు బ్రిడ్జి మునిగిపోతుందని తెలిపారు. ఈ విషయం స్థానికులకు తెలుసు కాబట్టి వారు జాగ్రత్తగా ఉంటారని తెలిపారు. చీకటిపడటం, గూగుల్‌ డైరెక్షన్‌ ఆధారంగా వెళ్లడంతో సతీశ్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వివరించారు. కాబట్టి జాగ్రత్త. గూగుల్ మ్యాప్ ఉందిగా అని గుడ్డిగా ముందుకు వెళితే.. ఇలాంటి ప్రమాదాలు ఎదురుకావొచ్చు. టెక్నాలజీతో పాటు కాస్త విచక్షణ కూడా ఉపయోగించాలి. ముఖ్యంగా కొత్త ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అక్కడి పరిస్థితుల గురించి ముందుగానే తెలుసుకోవాలి.


By January 13, 2021 at 02:14PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-drives-into-dam-after-following-google-map-drowns-to-death-in-maharashtra/articleshow/80248230.cms

No comments