Breaking News

అలా అయితే ఆస్ట్రేలియాలో సెర్చ్ నిలిపివేస్తాం.. గూగుల్ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించిన ప్రధాని


వార్తల కోసం స్థానిక ప్రచురణకర్తలకు చెల్లించాల్సి వస్తే ఆస్ట్రేలియాలో తన సెర్చ్ ఇంజిన్‌ను నిలిపివేస్తామని గూగుల్ హెచ్చరించింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం-గూగుల్‌కు మధ్య నెలల తరబడి సాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. సంస్థ కోసం వార్తలు రాసే ప్రచురణకర్తలకు పరిహారం ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రతిపాదిత చట్టం ‘పనికిరానిది’ అని గూగుల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా శుక్రవారం పార్లమెంటరీ విచారణలో వ్యాఖ్యానించారు. సెర్చ్ రిజల్ట్‌లో ఆర్టికల్స్ డిస్‌ప్లేకి మీడియా సంస్థలకు గూగుల్ చెల్లించాల్సిన అవసరాన్ని ఆమె ప్రత్యేకంగా వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ చర్యలను నిరోధించడానికి డిజిటల్ దిగ్గజం గూగుల్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓ స్థానిక నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియాలో కనీసం 94 శాతం ఆన్‌లైన్ సెర్చ్ ఆల్ఫాబెట్ ఇంక్‌లోనే జరుగుతున్నాయి. గూగుల్ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఈ బెదిరింపులకు తాము స్పందించబోమని ప్రధాని స్కాట్ మోరిసన్ అన్నారు. ‘మా దేశంలో మీరు చేయగలిగే పనుల కోసం ఆస్ట్రేలియా నియమాలను రూపొందిస్తుంది. అది మా పార్లమెంటులో జరిగింది.. దీనిని మా ప్రభుత్వం చేసింది.. ఆస్ట్రేలియాలో మీ నిబంధనలు ఎలా పనిచేస్తాయి’ అని మండిపడ్డారు. ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఫేస్‌బుక్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈచట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే ఫేస్‌బుక్ ద్వారా వార్తలను ప్రచురించే ఆస్ట్రేలియన్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. స్థానిక మీడియాకు మద్దతుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని గూగుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై విచారణ సందర్భంగా గూగుల్ చేసిన వ్యాఖ్యలపై సెనేటన్ ఆండ్రూ బ్రాగ్ తీవ్రంగా స్పందించారు. ఆస్ట్రేలియా ప్రజలు, విధాన నిర్ణేతలను గూగుల్ బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘కోడ్ సంస్కరణ చట్టంగా మారితే, గూగుల్ సెర్చ్‌ను ఆస్ట్రేలియాలో నిలిపివేయడం తప్ప మాకు ఇంకో ఆప్షన్ లేదు’ అని సిల్వా సెనేటర్ల బృందానికి స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని "ఆమోదయోగ్యం కాని ఆర్థిక, కార్యాచరణగా అభివర్ణించారు. కాలిఫోర్నియాకు చెందిన గూగుల్ మౌంటెన్ వ్యూ.. ఫ్రెంచ్ మీడియా ప్రచురణకర్తలతో గురువారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కాపీరైట్ చట్టాలకు లోబడి ఉండటానికి గతేడాది ఫ్రెంచ్ వినియోగదారుల కోసం సెర్చ్ రిజల్ట్‌పై యూరోపియన్ ప్రచురణకర్తల వార్తలను గూగుల్ నిలిపివేసింది.


By January 22, 2021 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/we-dont-respond-to-threats-australian-pm-morrison-over-googles-warning/articleshow/80399303.cms

No comments