Breaking News

రైతులు, సైనికులు, శాస్త్రవేత్తల కృషి అపారం.. సంస్కరణలపై అపోహలు సహజం: రాష్ట్రపతి రిపబ్లిక్ డే సందేశం


భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో చైనాతో నెలకున్న ఉద్రిక్తతలు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తదితర అంశాలను కోవింద్ ప్రస్తావించారు. రైతుల శ్రమ, సైనికుల త్యాగం, శాస్త్రవేత్తల అంకితభావంపై ప్రశంసలు కురిపించారు. ఆహార భద్రత, సరిహద్దు రక్షణ, ఆరోగ్య పరిరక్షణలో వారంతా తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం’ ఆశయాలను ప్రభుత్వాలతో పాటు, ప్రజలు కూడా ఆచరించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో విస్తరణ ప్రయత్నాలను మన వీర సైనికులు విఫలం చేశారని.. గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారని అన్నారు. భారత్ శాంతికి కట్టుబడి ఉందని, అయితే దేశ భద్రతను బలహీన పరచే ప్రయత్నాలను పూర్తి సమన్వయంతో తిప్పికొట్టే సామర్థ్యం మన సైన్యానికి ఉందన్నారు. దేశ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు. వ్యవసాయంలో దేశాన్ని స్వయంసమృద్ధిగా మార్చినందుకు రైతులకు ప్రతి భారతీయుడూ వందనం చేస్తున్నాడని, ప్రకృతి వైపరీత్యాలు ఎదురయినా తమ లక్ష్యాలను సాధించారని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్న రాష్ట్రపతి.. ఆర్థిక సంస్కరణలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కరణలు చేపట్టినప్పుడు ప్రారంభ దశలో కొన్ని అపోహలు రావడం సహజమేనని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయమై అనుమానాలు అక్కర్లేదని ఉద్ఘాటించారు. ‘ఎంతో ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లోనూ మన సైనికులు దేశ సరిహద్దులను కాపాడుతున్నారు.. సియాచిన్‌, లద్దాఖ్‌ల్లో మంచు గడ్డకట్టి మైనస్‌ 50, 60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే జైసల్మేర్‌లో 50 డిగ్రీల సెల్సియస్‌తో ఎండలు మండిపోతుంటాయి. వీటన్నింటినీ అధిగమించి మన యోధులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. వారి శౌర్యం, దేశభక్తి, అంకితభావానికి ప్రతి పౌరుడూ గర్వపడుతుంటారు’ అని ప్రశంసించారు. కరోనాపై జరిగిన పోరులో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు సహా అన్ని వర్గాలు నిరంతరం కృషి చేసి దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉండేటట్టు చూశారని అన్నారు. ఆహార భద్రత, దేశ రక్షణ మాదిరిగానే శాస్త్రవేత్తలు జాతి ప్రయత్నాలను బలోపేతం చేశారని, వారు రేయింబవళ్లు కష్టపడి కరోనా వైరస్‌ లక్షణాలను గుర్తించి రికార్డు సమయంలో వ్యాక్సిన్‌ను తయారు చేశారు.


By January 26, 2021 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/our-valiant-soldiers-foiled-expansionist-move-president-kovind-says-republic-day-speech/articleshow/80460340.cms

No comments