Breaking News

బైడెన్ ప్రమాణస్వీకారం వేళ అల్లర్లకు ప్లాన్.. అగ్రరాజ్యంలో ఆందోళన!


గతవారం గెలుపు ధ్రువీకరించే కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగా.. ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడిచేసిన విషయం తెలిసిందే. నాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, బైడెన్‌ ప్రమాణస్వీకారానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. దీంతో అమెరికాలో వాతావరణం గంభీరంగా మారిపోయింది. ముఖ్యంగా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో వీధులన్నీ భద్రతా బలగాలతో కిక్కిరిసిపోతున్నాయి. అలాగే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లోనూ వాతావరణం వేడెక్కింది. క్యాపిటల్‌ భవనాలపై డేగ కళ్లతో నిఘా కొనసాగుతోంది. ట్రంప్‌ మద్దతుదారులు మరోసారి బీభత్సం సృష్టిస్తారోననే అనుమానంతో అన్ని వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రాళ్లు రువ్వడం దగ్గరి నుంచి బాంబు పేలుళ్ల వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలైనా చోటుచేసుకోవచ్చని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండి ప్రమాదాల్ని అరికట్టాలని భద్రతా విభాగాలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌బీఐ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఎమర్జెన్సీని ప్రకటించారు. మిషిగన్‌, వర్జీనియా, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా, వాషింగ్టన్‌ రాష్ట్రాలు ఇప్పటికే ఫెడరల్‌ బలగాలను ఆశ్రయించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనించనున్నాయి. జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై జరిపిన దాడిని స్ఫూర్తిగా తీసుకొని దుండగులు మరోసారి రెచ్చిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అలాగే వందంతులు వ్యాప్తి చేసి అల్లర్లకు ఉసిగొల్పే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విస్కాన్సిన్‌, మిషిగన్‌, పెన్సిల్వేనియా, అరిజోనా రాష్ట్రాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన కూడళ్లు, రెస్టారెంట్లు, చారిత్రక ప్రదేశాలు, ప్రభుత్వ భవనాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న అతివాదులే దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, ఏ క్షణంలోనైనా వీరంతా రోడ్లపైకి వచ్చి ట్రంప్‌నకు మద్దతుగా ర్యాలీలు చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆయుధాలతో కూడిన ర్యాలీకి ఫార్-రైట్ ఆన్‌లైన్ ఫోరమ్ పిలుపునిచ్చినట్టు అమెరికా మీడియా పేర్కొంది. వీటికి బలం చేకూర్చేలా భారీగా ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తిని వాషింగ్టన్ డీసీ సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడి వద్ద హ్యాండ్‌గన్, 500 రౌండ్ల అమ్యూనిషన్, షాట్‌గన్ షెల్స్, మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ అనుకూల నిరసనకారులు ఎదుర్కొవాలని పేర్కొంటూ యూట్యూబ్‌లో వీడియోను పోస్ట్‌చేసిన అమెరికా ఆర్మీ మాజీ సైనికుడు డేనియల్ అలన్ బాకర్‌ను ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. తొలి నుంచి ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోన్న ప్రస్తుత అధ్యక్షుడు .. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకాబోనని ప్రకటించారు. ఇదే సమయంలో తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అభిశంసన ద్వారా గడువుకి ముందే పీఠం నుంచి దింపడానికి డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం పొందిన తీర్మానం.. సెనెట్‌లో బుధవారం చర్చకు రానుంది.


By January 17, 2021 at 01:50PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-braces-for-potential-violence-ahead-of-president-elect-joe-biden-inauguration/articleshow/80312387.cms

No comments