అఫీసులో కునుకు తీశారో ఇక ఇంటికే.. కేంద్రం కొత్త నిబంధనలు
విధి నిర్వహణలో ఉద్యోగి నిద్రపోవడం కూడా దుష్ప్రవర్తన కిందికే వస్తుందని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది. మొత్తం 23 వ్యవహారాలు దుష్ప్రవర్తన కిందికి వస్తాయని, అలాంటి విషయాల్లో యజమాని క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లోని సెక్షన్ 29 ప్రకారం కేంద్ర కార్మికశాఖ తయారీ, మైనింగ్, సర్వీస్ రంగాలకోసం ముసాయిదా మోడల్ స్టాండింగ్‌ను జారీచేస్తూ శనివారం నోటిఫికేషన్ వెలువరించింది. దీనిపై 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చింది. సేవా రంగానికున్న ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్‌ని జారీచేశామని, ఇలా చేయడం ఇదే తొలిసారని కేంద్ర కార్మికశాఖ పేర్కొంది. ఈ మోడల్ స్టాండింగ్ ప్రకారం ఉద్యోగి ప్రవర్తన సక్రమంగా లేకపోతే విచారణ పెండింగ్‌లో ఉండగానే విధుల నుంచి తప్పించే అవకాశం ఉంది. అలాగే, ఐటీ ఉద్యోగుల పని గంటలను నిర్దేశించలేదు. నియామక సమయంలో ఉద్యోగి, యజమానికి మధ్య కుదిరే షరతులతో కూడిన ఒప్పందం ప్రకారం పని గంటలు ఉంటాయని స్పష్టం చేసింది. ఉద్యోగి దుష్ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు తయారీ, సేవారంగాలకు ఒకేరకంగా ఉన్నాయి. ఐటీ పరిశ్రమ భద్రతను దృష్టిలో ఉంచుకొని అందులో పనిచేసే ఉద్యోగులు అనధికారికంగా ఐటీసిస్టం, యజమాని, కస్టమర్, క్లయింట్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లోకి జొరబడటాన్ని వ్యక్తిగత దుష్ప్రవర్తన కింద పేర్కొన్నారు. ‘ఈ మోడల్ స్టాండింగ్ ఆర్డర్లు దేశంలో పరిశ్రమల సామరస్యానికి మార్గం సుగమం చేస్తాయి.. ఎందుకంటే ఇది సేవలకు సంబంధించిన విషయాలను స్నేహపూర్వకంగా క్రమబద్ధీకరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది’ అని మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ వ్యాఖ్యానించారు. సేవా రంగానికి సంబంధించిన మోడల్ స్టాండింగ్ ఉత్తర్వుల్లో ‘ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్)’ అనే భావన అధికారికం చేశారు. ⍟ దొంగతనం, మోసం, విధి నిర్వహణలో అవినీతి.. స్వీయ ప్రయోజనాలకోసం లంచాలు ఇవ్వడం, తీసుకోవడం. ⍟ వ్యక్తిగతంగా, ఇతరులతో కలిసి కానీ ఉద్దేశపూర్వకంగా ఎదురుతిరగడం, చెప్పినమాట వినకపోవడం, పై అధికారులు లిఖితపూర్వకంగా జారీచేసిన చట్టబద్ధమైన ఉత్తర్వులను పాటించకపోవడం. ⍟ విధులకు ఆలస్యంగా రావడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సెలవు తీసుకోకుండా, సరైన కారణం లేకుండా తరచూ గైర్హాజరుకావడం. ⍟ విధినిర్వహణలో మద్యం సేవించడం, గొడవపడటం, పనిచేసే స్థలంలో అమర్యాదకరంగా, అసభ్యంగా ప్రవర్తించడం... నిర్లక్ష్యాన్ని అలవాటుగా మార్చుకోవడం.. జరిగే పనులకు, యజమాని ఆస్తికి కావాలని నష్టం కల్గించడం. ⍟ విధి నిర్వహణలో నిద్రపోవడం... లేని జబ్బు ఉన్నట్లు నటించడం, పని నెమ్మదించేలా చేయడం.. కింది స్థాయి ఉద్యోగుల నుంచి బహుమతులు స్వీకరించడం..నైతిక ప్రవర్తనకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షకు గురికావడం. ⍟ విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, గత అనుభవం గురించి ఉద్యోగంలో చేరే సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం.. ముందస్తు అనుమతి, తగిన కారణం లేకుండా పని వదిలివెళ్లడం.
By January 03, 2021 at 07:33AM
No comments