కొవాగ్జిన్ సమర్ధతపై విమర్శలు.. తొలి దశ ఫలితాలపై లాన్సెట్ జర్నల్ ప్రశంసలు!


భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా సమర్ధతపై అనేక సందేహాలు వ్యక్తమవుతోన్న వేళ.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన తొలి దశ ప్రయోగ ఫలితాలు ప్రచురితమయ్యాయి. కొవాగ్జిన్ తీసుకున్న వాలంటీర్లలో ఎటువంటి ప్రతికూలతలు తలెత్తలేదని, మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసిందని పేర్కొన్నారు. భారత్ నుంచి ప్రయోగ ఫలితాలు సమాచారాన్ని లాన్సెట్‌లో ప్రచురించిన తొలి టీకా కొవాగ్జిన్ కావడం విశేషం. ఈ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ‘BBV152 (కొవాగ్జిన్ కోడ్) యాంటీబాడీ ప్రతిస్పందనలను ప్రేరేపించడం, తటస్థీకరించడం సహా ఆల్గెల్-ఐఎమ్‌డీజీని చేర్చడం వల్ల SARS-CoV-2 టీకా Th1- ప్రతిస్పందనను ప్రేరేపించింది.. అన్ని వయసుల వారిలోనూ ప్రభావంతంగా పనిచేస్తోంది... టీకా కారణంగా ఎవరిలోనూ తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవ్వలేదు.. టీకా తీసుకున్న ఒకే ఒక వ్యక్తి తీవ్రమైన ప్రతికూలత ఎదుర్కొన్నా దానికి వ్యాక్సిన్‌తో సంబంధం లేదు’లాన్సెట్ నివేదించింది. నిపుణులు చెప్పినదాని ప్రకారం.. ఏ టీకా వేసుకున్నా నొప్పి, జ్వరం సర్వసాధారణం.. కానీ ఇవి అంత ప్రమాదకరం కాదని, ఎటువంటి చికిత్స లేకుండానే తగ్గిపోతాయి.. దీనిని సురక్షితంగా భావించాలి. తీవ్రమైన దుష్ప్రభావం తలెత్తితే చికిత్స చేయడానికి చాలా సమయం పడుతుంది. తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. పాక్షిక నష్టాన్ని కలిగిస్తుంది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించకుండానే అత్యవసర వినియోగానికి ఎలా అనుమతించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు విమర్శలకు సమాధానమిచ్చిందని భారత్ బయోటెక్ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఆ సంస్థ పేర్కొంది. భారత్ బయోటెక్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘అత్యంత ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్‌లో ప్రచురించిన కోవాగ్జిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్ ఫలితాలను ప్రకటించినందుకు చాలా గర్వంగా ఉంది’ అన్నారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న 25,800 మంది వాలంటీర్లలో 13,000 మందికి విజయవంతంగా రెండో డోస్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.


By January 23, 2021 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covaxin-produced-tolerable-safety-outcomes-says-lancet-journal/articleshow/80418896.cms

No comments