Breaking News

కరోనా సోకిన మహిళ, ఆమె శిశువు పట్ల నిర్లక్ష్యం.. పదవి నుంచి తప్పుకున్న ప్రధాని!


కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణుకుతోంది. మహమ్మారి వ్యాప్తితో అన్ని దేశాలూ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కోవిడ్ నియంత్రణలో పలు దేశాలు చేతులెత్తేశాయి. ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. పేద దేశాల పరిస్థితి వర్ణనాతీతం. కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినడంతో జపాన్ ఆర్ధిక మంత్రి ఆత్మహత్య కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ ప్రధాని సైతం కొవిడ్ మహమ్మారి కట్టడిలో విఫలమవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఖురే‌లోసుఖ్ ఉఖ్నా ప్రధాని మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని గురువారం పార్లమెంట్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కొవిడ్ బాధితురాలు, ఆమె నవజాత శిశువుకు పునరావాసం కల్పించడంలో మంగోలియా ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగోలియా రాజధాని ఉలాన్‌ బాతార్‌ బుధవారం తీవ్ర స్థాయి నిరసనలతో అట్టుడికిపోయింది. ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. అయినా ప్రజలు శాంతించలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది. కరోనాను కట్టడిచేసే జాతీయ అత్యవసర కమిషన్‌కు చీఫ్‌గా వ్యవహరిస్తోన్న ఉప-ప్రధాని కూడా ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ బుధవారమే రాజీనామా చేశారు. ‘దురదృష్టవశాత్తూ ఆ తల్లికి పునరావసం కల్పించడంలో తప్పు జరిగిపోయింది.. ఆమె పట్ల వ్యవహరించిన తీరుకు హృదయం ముక్కలయ్యింది.. ఓ ప్రధానిగా ఈ ఘటనకు నేను బాధ్యతవహించాలి’ అని ఖురే‌ల్‌సుఖ్ వ్యాఖ్యానించారు. కరోనా చికిత్స కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలికి, నవజాత శిశువుకు మైనస్ 25 డిగ్రీల వాతావరణంలోనూ ఎటువంటి సంరక్షణ కల్పించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. మంగోలియా సంప్రదాయం ప్రకారం.. ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలింతలు నెల రోజుల పాటు చల్లటి వాతావరణం, చల్లటి ఆహారానికి దూరంగా ఉండాలి. కరోనా వైరస్ ప్రారంభ దశలో వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేసి, మంగోలియా ప్రభుత్వం ప్రశంసలు కూడా అందుకుంది. సరిహద్దులను మూసేసి మహమ్మారిని నియంత్రించింది. అయితే నవంబరులో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి రష్యా నుంచి మంగోలియాలోకి ప్రవేశించాడు. దాంతో దేశంలో వైరస్ విజృంభణ ప్రారంభమైంది. ఇప్పుడు దాని కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్ విధించి, కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది.


By January 22, 2021 at 07:31AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/mongolian-prime-minister-resigns-after-protests-over-covid-19-mothers-treatment/articleshow/80397451.cms

No comments