Breaking News

నిర్మాత దొరస్వామి మృతి: ‘సింహాద్రి’ జ్ఞాపకాలు.. ఎన్టీఆర్, రాజమౌళి భావోద్వేగం


విజయ మారుతీ క్రియేషన్స్ (వీఎంసీ) అధినేత, ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే వి.దొరస్వామి రాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న దొరస్వామి రాజు.. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సీడెడ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్‌గా తన మార్కు చూపించిన దొరస్వామి రాజు.. ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘అన్నమయ్య’, ‘సింహాద్రి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ని నిర్మించారు. దాదాపు 1000 సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. కాగా, వి.దొరస్వామి రాజు మృతికి జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్.రాజమౌళి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు ఎ.ఎం.రత్నం, సూర్యదేవర నాగవంశీ, బండ్ల గణేష్ తదితరులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. దొరస్వామి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, దొరస్వామితో ఎన్టీఆర్, రాజమౌళి, రాఘవేంద్రరావుకు కాస్త ఎక్కువ అనుబంధం ఉంది. హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సింహాద్రి’ని దొరస్వామి నిర్మించారు. అలాగే, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అన్నమయ్య’కు కూడా దొరస్వామి రాజే నిర్మాత. దొరస్వామి మృతి పట్ల ట్విట్టర్‌లో ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని పేర్కొన్నారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పందిస్తూ.. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా వెయ్యికి పైగా సినిమాలను దొరస్వామి రాజు గారు విడుదల చేశారు. కొన్ని అద్భుతమైన మరపురాని తెలుగు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. వీఎంసీ బ్యానర్‌ నుంచి వచ్చిన ఆణిముత్యాల్లో ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘అన్నమయ్య’ లాంటి చిత్రాలు కొన్ని. నా కెరీర్‌ను మలుపు తిప్పిన ‘సింహాద్రి’ సినిమాకు ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి డిస్ట్రిబ్యూటర్, నిర్మాతను కోల్పోయిందని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో మెసేజ్‌ను ట్వీట్ చేశారు. అలాగే, నాగవంశీ, ఎం.ఎం.రత్నం, బండ్ల గణేష్ సైతం దొరస్వామి రాజు సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


By January 18, 2021 at 02:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jr-ntr-ss-rajamouli-k-raghavendra-rao-and-others-pay-respects-to-producer-v-doraswamy-raju-death/articleshow/80326564.cms

No comments