వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు.. సింఘూ సరిహద్దు వద్ద విషం తాగి రైతు ఆత్మహత్య
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 45వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయక అన్నదాతలు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌కు చెందిన (40) శనివారం విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అమరీందర్ విషం తీసుకోవడం గమనించిన సహచర రైతులు వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అమరీందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటివరకు వివిధ కారణాలతో 57 మంది మరణించారు. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన అమరీందర్ సింగ్.. శనివారం ఉదయం విషం తాగడంతో హుటాహుటీన చికిత్స కోసం సోనేపట్ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటలకు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. రైతు ఆత్మహత్యాయత్నం గురించి ఆయన చనిపోవడానికి గంట ముందు హరియాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా, ఇటీవల యూపీలోని రామ్‌పూర్ జిల్లాకు చెందిన కశ్మీర్ సింగ్ అనే రైతు కూడా ఘాజీపూర్ సరిహద్దు వద్ద అత్మహత్య చేసుకున్నాడు. ఇక, డిసెంబరులో పంజాబ్‌కు చెందిన అమర్జీత్ సింగ్ అనే లాయర్ టిక్రీ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైతుల ఆందోళనకు మద్దతుగా తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. డిసెంబరు 20 గుల్బార్ సింగ్ అనే రైతు, 21 మరో రైతు విషం తాగి చనిపోయారు.
By January 10, 2021 at 10:12AM
No comments