Breaking News

నేడే అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు.. భారత కాలమానం ప్రకారం ఎంతకంటే?


అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్.. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు బైడెన్‌ అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. అంతకంటే ముందే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడి ఫ్లోరిడాలోని తన సొంత నివాసానికి వెళ్లనున్నారు. సంప్రదాయానికి భిన్నంగా కొత్త అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి హాజరుకాకుండానే ఆయన వెళ్లిపోనున్నారు. తొలిసారిగా ఓ మహిళ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుండగా.. తొలి నల్లజాతి, అమెరికన్ ఆసియన్ కూడా కావడం విశేషం. బైడెన్ 127 ఏళ్లుగా తన కుటుంబం వద్ద ఉన్న పురాతన బైబిల్‌పై ప్రమాణం చేయనున్నారు. అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ ముందు జరిగే ఈ వేడుకలో భార్య జిల్ బైడెన్ కూడా పాల్గొంటారు. అంతకు ముందు చర్చికి వెళ్లి ప్రార్థనలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు ఈ కార్యక్రమం అమెరికా జాతీయ గీతాలపనతో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో ప్రతిజ్ఞ, కవిత్వ పఠనం, సంగీత ప్రదర్శనలు, బెనెడిక్షన్ వేడుక కూడా ఉంటాయి. మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బైడెన్, హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు.. ‘మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సమయంలో సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రజలను సురక్షితంగా. ఆరోగ్యంగా ఉంచడం ప్రధానం’ అని బైడెన్ కార్యాలయం ప్రకటించింది. బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అమెరికా సహా అన్ని అంతర్జాతీయ మీడియా నెట్‌వర్క్స్, bideninaugural.com ద్వారా ప్రసారం చేస్తారు. అలాగే యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ట్విచ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, మైక్రోసాఫ్ట్ బింగ్, న్యూస్‌నౌ ఫ్రమ్ ఫాక్స్, ఏటీ అండ్ టీ యూ వెర్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. https://twitter.com/JoeBiden బైడెన్‌ ప్రమాణస్వీకారానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేయడంతో అమెరికాలో వాతావరణం గంభీరంగా మారిపోయింది. ముఖ్యంగా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో వీధులన్నీ భద్రతా బలగాలతో కిక్కిరిసిపోయాయి. ట్రంప్‌ మద్దతుదారులు మరోసారి బీభత్సం సృష్టిస్తారోననే అనుమానంతో అన్ని వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో బైడెన్ గెలుపొందినా.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయన విజయాన్ని అంగీకరించక కోర్టులను సైతం ఆశ్రయించారు. అక్రమాలతో ఎన్నికల్లో గెలిచారని, అధికార బదలాయింపునకు ఓ దశలో ససేమిరా అన్నారు. న్యాయస్థానాల్లో ఆయన వాదనలకు చుక్కెదురు కావడంతో ట్రంప్ తన ఓటమిని అంగీకరించక తప్పలేదు. అయినా సరే, బైడెన్ మార్గంలో ఆటంకాలను సష్టించే ప్రయత్నాలను వదిలిపెట్టలేదు. బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సమావేశం నిర్వహించగా.. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు.


By January 20, 2021 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-elect-joe-biden-oath-ceremony-india-timing-how-to-watch-and-all-other-details/articleshow/80359817.cms

No comments