Breaking News

ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. 53 మంది సజీవదహనం


ఆయిల్ ట్యాంకర్- బస్సు ఢీకొట్టి 53 మంది సజీవదహమైన ఘటన ఆఫ్రికా దేశం కామెరూన్‌లో చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన సంభవించింది. తీరప్రాంత డౌలా నగరం నుంచి బఫౌసమ్ వైపు వెళ్తున్న బస్సు శాంత్‌చౌ గ్రామం దగ్గర ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు డశ్చాంగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులతో వస్తున్న బస్సు అక్రమంగా ఆయిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్‌పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత భారీగా మంటలు చెలరేగడంతో బస్సులోని ప్రయాణికులు ఆ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.00 గంటలప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై కామెరూన్ రవాణా మంత్రి జీన్ ఎర్నెస్ట్ మస్సేనా ఎంగల్లే బిబేహే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘రాత్రివేళ జరిగిన ఈ ప్రమాదం దురదృష్టకరం.. కొన్ని ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు పట్టణాల మధ్య రాత్రిపూట ప్రయాణాలకు మొగ్గుచూపడం ఓ కారణం.. దీనిపై పర్యవేక్షణ అవసరం’ అని రవాణా మంత్రి అన్నారు. ప్రమాదానికి గురైన బస్సు మెనౌవ్ వ్యోజెస్‌‌ ట్రావెల్స్ సంస్థకు చెందిందని అన్నారు. ప్రమాద బాధితుల్లో చిన్నారులు సైతం ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. దర్యాప్తు చేపట్టా, ప్రమాదానికి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా, గత నెలలోనూ యువౌండే-బఫౌసమ్ వద్ద చోటుచేసుకుని 37 మంది మృతిచెందారు.


By January 28, 2021 at 07:06AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-50-dead-due-to-bus-crash-oil-tanker-in-west-cameroon/articleshow/80490913.cms

No comments