Breaking News

దొంగ తెలివి.. నమ్మశక్యం కాని రీతిలో.. రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచేశాడు


దొంగలు తెలివి మీరుతున్నారు. పక్కా ప్లాన్‌తో చాలా ఈజీగా లక్షలు కాజేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ దొంగ.. స్వర్ణకారుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని.. రూ.25 లక్షల విలువైన 520 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఇంత తేలిగ్గా దొంగతనం చేయొచ్చా.. అని ఆశ్చర్యపడేలా.. ఆ చోరుడు తన చోర కళను ప్రదర్శించాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. టోఫిక్ అలీ ఖాన్ (42) అనే స్వర్ణకారుడు బెంగళూరులోని పిల్లప్ప చెరువు ప్రాంతంలో నివాసం ఉంటూ... కబ్బన్‌పేట్‌లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. నరేశ్ కుమార్ అనే వ్యక్తి జనవరి 2న అతణ్ని కలిశాడు. ప్రముఖ జ్యూవెలరీ సంస్థలకు మధ్యవర్తిగా పని చేస్తున్నానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. కొన్ని జ్యూవెలరీ బ్రాండ్ల పేరు చెప్పి.. ఆ సంస్థలకు స్వర్ణకారులు కావాలని చెప్పాడు. మీరు చేసిన డిజైన్లు చూడాలని చెప్పాడు. మీరు డిజైన్ చేసిన బంగారు ఆభరణాలను తీసుకొస్తే మా బాస్‌కు చూపిద్దామని ఖాన్‌కు చెప్పాడు. నరేశ్ మాటలు నమ్మిన ఖాన్.. జనవరి 4న సాయంత్రం 7 గంటల సమయంలో తాను డిజైన్ చేసిన బంగారు ఆభరణాలను తీసుకొని ఎంజీ రోడ్‌లోని ఎల్ఐసీ బిల్డింగ్ దగ్గరకు వెళ్లాడు. ఎల్ఐసీ బిల్డింగ్‌కు కుడివైపున ఉన్న భవంతిలోకి అతణ్ని తీసుకెళ్లాడు. ‘‘ముందు ఆభరణాలను ఇస్తే.. తీసుకెళ్లి మా బాస్‌కు చూపిస్తాను.. ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి రమ్మంటాను. అప్పటి వరకూ ఇక్కడే కూర్చోండి’’ అని చెప్పి 520 గ్రాముల బరువైన బంగారు నగలను తీసుకెళ్లాడు. ఎంత సేపటికీ నరేశ్ తిరిగి రాకపోవడంతో ఖాన్‌‌కు అనుమానం వచ్చి రిసెప్షనిస్టు దగ్గరకెళ్లి అడిగాడు. అతడు వెనుక వైపు నుంచి వెళ్లిపోయాడని ఆమె చెప్పడంతో ఖాన్ షాకయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.


By January 13, 2021 at 01:56PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-goldsmith-loses-jewellery-worth-rs-25-lakh-to-middle-man/articleshow/80247944.cms

No comments