Breaking News

వయసు 23.. పెళ్లిళ్లు 11.. నిత్య పెళ్లికొడుకు ఆట కట్టించిన పోలీసులు


ఆ యువకుడు చూడటానికి అమాయకంగా కనిపిస్తాడు. కానీ అమ్మాయిలను మోసం చేస్తూ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. అతడి కన్నేసి ఏ అమ్మాయినైనా చిటికెలో బుట్టలో వేసుకుంటాడు. పెళ్లి చేసుకుని శారీరక వాంఛలు తీర్చుకున్నాక మొహం చాటేస్తాడు. ఈ విధంగా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని పెళ్లిళ్లు చేసుకుని మోసం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అతడి వయసులో ఎంతో తెలుసా.. 23 సంవత్సరాలే. Also Read: రాజధాని చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన గణేష్(23) అనే యువకుడు కొలాత్తూర్‌కు చెందిన యువతి(20)తో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబర్ 5న ఆ యువతిని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. దీంతో తమ కూతురు కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేష్ అత్తమామల నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రెండు వర్గాలను స్టేషన్‌కు పిలిచిన పోలీసులు పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలోనే ఆ యువతి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. తాను గణేష్‌తో సంతోషంగా ఉన్నానని, అతడితోనే కాపురం చేస్తానని తెగేసి చెప్పింది. ఆమె మేజర్ కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత గణేష్ తన భార్యతో విల్లివాక్కంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత ఓ యువతిని పనిమనిషింటూ తీసుకొచ్చాడు. ‘ఉండేది ఇద్దరం.. మనకు పనిమనిషి ఎందుకు’ అని భార్య చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పనిమనిషిలో గణేష్ సన్నిహితంగా మెలగడం చూసి భార్య మందలించేది. దీంతో వారిమధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గణేష్ తన భార్యను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టేవాడు. భార్య ముందే మరో గదిలో పనిమనిషితో రాసలీలలు కొనసాగించేవాడు. అది చాలదన్నట్లు తన స్నేహితులను తీసుకొచ్చి ఇంట్లో మద్యం సేవించేవాడు. ఈ క్రమంలోనే ఓ రోజు గణేష్ స్నేహితుడొకరు మద్యం మత్తులో అతడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయపడి గట్టిగా కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. తన పరిస్థితి గురించి ఇంటి యజమానికి చెప్పిన ఆమె అతడి సాయంతో పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులతో కలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను ఇప్పటివరకు 11 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నానని, ఒకరికి తెలియకుండా మరొకరితో సన్నిహితంగా ఉంటున్నానని చెప్పాడు. దీంతో షాకైన పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలు గుట్టుగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.


By January 16, 2021 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-arrested-for-marries-11-girls-in-chennai/articleshow/80296163.cms

No comments